అందరితో చర్చించి ప్రధాన మంత్రి అభ్యర్థిపై నిర్ణయం : మమత బెనర్జీ


న్యూఢిల్లీ : కేంద్రంలో రాబోయేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీయేయేతర, యూపీయేయేతర ప్రభుత్వం రాబోతోందన్నారు. ప్రధాన మంత్రి అభ్యర్థిని ఫెడరల్ ఫ్రంట్ నేతలందరితో కలిసి చర్చించి, నిర్ణయిస్తామన్నారు.
 
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ప్రస్తుతం ఇద్దరు లోక్‌సభ సభ్యులు ఉన్నారని, ఈ ఎన్నికల్లో కనీసం ఆ రెండు స్థానాలైనా ఆ పార్టీకి దక్కవని మమత చెప్పారు. చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు జాతీయ పార్టీలుగా మారాయన్నారు. టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) కూడా జాతీయ పార్టీ అయిందన్నారు. తామంతా కలిసికట్టుగా వ్యూహాన్ని రచిస్తామన్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని, దేశాన్ని కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యతాంశమని చెప్పారు. వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం గురించి ఆలోచించడం లేదన్నారు.
 
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఆ ప్రభుత్వ వైఫల్యాలను కనీసం వెయ్యి అయినా చెప్పగలనన్నారు. మోదీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు. గత ఐదేళ్ళలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు.
 
ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే దాని గురించి ఇప్పుడే తాము మాట్లాడబోమని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలు ఉండే పార్టీ తమదే అవుతుందని, అయినప్పటికీ ప్రధాన మంత్రి అభ్యర్థిని నిర్ణయించేది ఎవరు? అనేది ముఖ్య విషయం కాదని చెప్పారు. కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, బిహార్, అస్సాం నేతలతో కలిసి, చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై ప్రధాన మంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత  ఏం జరగబోతోందో తాను ఇప్పుడు జోస్యం చెప్పలేనన్నారు. ఇప్పటికిప్పుడే పీఎం అభ్యర్థి గురించి తాను వ్యాఖ్యానించబోనని తెలిపారు. సమష్టి నాయకత్వంపైనే తనకు నమ్మకం ఉందన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *