అతడు చనిపోవడం చాలా ఆనందంగా ఉంది: శ్రీలంక పేలుళ్ల సూత్రధారి సోదరి


కొలంబో: శ్రీలంక ఉగ్రదాడుల సూత్రధారి జహ్రాన్ హషీం చనిపోవడం తనకు చాలా ఆనందంగా ఉందని అతడి సోదరి మధానియా పేర్కొన్నారు. ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల్లో ఏకంగా 250 మంది ప్రాణాలు కోల్పోగా, 400 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఆత్మాహుతి దాడుల ప్రధాన సూత్రధారి జహ్రాన్ హషీమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కొలంబోలోని షంగ్రీలా హోటల్‌లో జహ్రాన్‌ తనని తానే పేల్చివేసుకున్నాడు. అయితే, చనిపోయింది అతడేనా? కాదా? అని నిర్ధారించేందుకు మిలటరీ అధికారులు అతడి సోదరి ఇంటికి వెళ్లినప్పుడు వారికి ఊహించని సమాధానం ఎదురైంది.
 
కాల్మునాయ్ ప్రాంతంలో నివసిస్తున్న మధానియా ఇంటికెళ్లిన అధికారులు ఆసుపత్రికి వచ్చి అతడి మృతదేహాన్ని చూసి గుర్తించాలని కోరారు. దీనికి ఆమె నిరాకరించారు. ఉగ్రవాదుల ఫొటోలు చూపిస్తే చెబుతాను తప్పితే రాలేనని, వారి మృతదేహాలను చూడాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు.
 
2017లోనే అతడితో మాట్లాడడం మానేశానని పేర్కొన్నారు. తన సోదరుడు ప్రసంగాలతో విషం చిమ్మేవాడని అన్నారు. తప్పుడు మనుషుల వద్ద అతడు ఇస్లాం నేర్చుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతడు తన చర్యలతో తమ కుటుంబానికి పెను విపత్తు తీసుకొచ్చాడని అన్నారు. జహ్రాన్ చనిపోయినందుకు తమకెంతో ఆనందంగా ఉందని మధానియా స్పష్టం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *