అత్యున్నత న్యాయస్థానంపై పెనుకుట్ర


 • న్యాయవ్యవస్థకు పెను ముప్పు పొంచి ఉంది
 • నన్ను అస్థిర పరిచేందుకు చాలా పెద్ద శక్తి పన్నాగం
 • చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌ ఆవేదన, ఆక్రోశం
 • సుప్రీం స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే యత్నం
 • వచ్చే వారం కీలక కేసులపై విచారణ ఆరంభం
 • ఈ దశలో ఈ ఆరోపణల వెనక మర్మమేంటి?
 • న్యాయమూర్తులు కోరుకునేది పరువు ప్రతిష్ఠలే
 • వాటిపైనే ఇప్పుడు నేరుగా దాడి జరుగుతోంది
 • నేర నేపథ్యమున్న ఆమెకు ఉద్యోగమెలా వచ్చింది
 • నేను డబ్బుకు లొంగనని దీన్ని తెరపైకి తెచ్చారు
 • 20 ఏళ్ల నిస్వార్థ సేవకు ఇదా బహుమతి?
 • ఏదేమైనా పదవి నుంచి దిగిపోయే ప్రసక్తే లేదు
 • నిర్భయంగా నా బాధ్యతలు నిర్వహిస్తా: సీజే
 • సీజే నన్ను లైంగికంగా వేధించారు
 • సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఆరోపణ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు, సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తినే టార్గెట్‌ చేసేందుకు పెను కుట్ర జరుగుతోందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ దేశ న్యాయవ్యవస్థ చాలా పెద్ద ముప్పులో ఉంది. అస్థిరపర్చే కుట్ర జరుగుతోంది. దీని వెనుక ఓ పెద్ద శక్తే ఉంది. చీఫ్‌ జస్టి్‌సను నిష్ర్కియగా చేయడానికి ఆ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమే వాటి లక్ష్యం’’ అని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అన్నారు. గత డిసెంబరులో కోర్టు నుంచి తొలగించిన ఓ మహిళా ఉద్యోగిని- తనను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ 22 మంది సుప్రీం న్యాయమూర్తులకు ఫిర్యాదు చేయడంతో శనివారం నాడు పెద్ద దుమారం రేగింది. ఉద్యోగం నుంచి తనను తొలగించడమే కాక- లంచం ఆరోపణలపై తనను జైలుపాల్జేశారని, సుప్రీంకోర్టులో పనిచేస్తున్న తన మరిదిని కూడా డిస్మస్‌ చేశారని, తన భర్తను వేధింపులకు గురిచేస్తున్నారని, తనను అన్నిరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆమె అభియోగం మోపారు.
 
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం దేశచరిత్రలో ఇదే ప్రథమం వీటిపై స్పందించిన జస్టిస్‌ గొగోయ్‌ ఈ మాటలన్నారు. కిందటేడాది అక్టోబరు 10, 11 తేదీల్లో సీజే తనను లైంగికంగా వేధించినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఇది లీఫ్‌లెట్‌, వైర్‌, స్ర్కాల్‌, కారవాన్‌ అనే నాలుగు వెబ్‌సైట్లలో ప్రచురితం కావడంతో వివాదం పతాకస్థాయికి చేరింది. తీవ్రతను గ్రహించిన జస్టిస్‌ గొగోయ్‌ వెన్వెంటనే తన నేతృత్వంలో, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కలిసి ధర్మాసనం ఏర్పాటు చేశారు. తన స్పందన కోరుతూ నాలుగు వెబ్‌సైట్లు ఈమెయిల్స్‌ పంపిన విషయాన్ని సీజే తొలుత ప్రస్తావించి ఆ ధర్మాసనంలో కాసేపు కూర్చుని- తన వివరణను ఇచ్చి- మిగిలినది తన సహచరులు పరిశీలిస్తారని చెప్పి బెంచ్‌ నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు.
 
డబ్బుకు లొంగనందుకే..!
‘‘ఆరోపణలపై నా వివరణ కోరుతూ నాలుగు వెబ్‌సైట్లు నాకు ప్రశ్నలు పంపాయి. నా ప్రతిస్పందనకు పదిగంటల సమయం ఇచ్చాయి’’ అని ఆయన చెప్పారు. ‘‘దీన్ని నేను నమ్మలేకుండా ఉన్నాను. ఈ ఆరోపణలకు బదులివ్వడం కూడా నేను దిగజారినట్లే అవుతుంది. అంచేత వీటికి బదులివ్వను. నేను చెప్పదల్చుకున్నదల్లా ఒకటే. ప్రతీ ఒక్క ఉద్యోగినీ నేను నిష్పక్షపాతంగా, గౌరవంగా చూస్తా. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి నా వద్ద నెలన్నర పాటు పనిచేసింది. ఇపుడీ ఆరోపణలు వచ్చాయి. నమ్మలేకపోతున్నాను. ఇరవయ్యేళ్లపాటు నిస్వార్థంగా పనిచేసిన నాకు చివరికి దక్కిన ప్రతిఫలం ఇది. నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కేవలం రూ 6,80,000. నా పీఎఫ్‌ కేవలం రూ 40లక్షలు. ఆఖరికి ప్యూను కూడా నాకంటే ఎక్కువ వెనకేసుకుంటాడు. నేనేమీ సంపాదించుకోలేదు. డబ్బు విషయంలో నన్నెవరూ వేలెత్తి చూపలేరు. నేనెన్నడూ అవినీతికి పాల్పడలేదు. అందుకే ఇలాంటివి తెర మీదకు తెచ్చారు’’ అని జస్టిస్‌ గొగోయ్‌ అన్నారు.
  
‘‘సచ్ఛీలుడైన వ్యక్తి జడ్జి కావాలని ఎందుకు కోరుకుంటాడు? ఒక జడ్జికి చాలా ముఖ్యమైనది పరువు, ప్రతిష్ట వాటిపైనే ఇపుడు దాడి జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమూర్తులు పనిచేయాల్సి వస్తుందనుకున్నపుడు మంచివారెందుకు ఇక్కడికొస్తారు? ఈ వేదికనుంచి దేశ ప్రజలకు నేను చెప్పేదొకటే. ఈ దేశ న్యాయవ్యవస్థ తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. దీని వెనుక పెద్ద కుట్రే ఉంది. సీజే పదవిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఏం జరిగినా నేను పదవీకాలం పూర్తయ్యేదాకా- అంటే వచ్చే ఏడునెలల పాటు నిర్భయంగా నా విధులు నిర్వర్తిస్తా’’ అని జస్టిస్‌ గొగోయ్‌ అన్నారు. తద్వారా.. ఈ ఆరోపణలొచ్చినా తాను వైదొలిగేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ‘‘ఆమెపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయి. క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉండగా అసలు ఆమెకు సుప్రీంకోర్టులో ఉద్యోగం ఎలా వచ్చింది? ఢిల్లీ పోలీసులను ఇదే విషయం అడిగాను’’ అని చెప్పారు.
 
‘‘ఈ దేశంలో రెండు పెద్ద వ్యవస్థలు (పదవులు) ఉన్నాయి. ఒకటి ప్రధాని, రెండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ ఆరోపణల వెనుక ఉన్న శక్తులు అందులో సీజే పదవిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు’’ అని ఆయన నర్మగర్భంగా దీని వ్యాఖ్యానించారు.

రాజకీయ కోణం?
‘‘వచ్చేవారం నేను కొన్ని ముఖ్యమైన కేసులపై విచారణ జరపాల్సి ఉంది. ఈ దశలో ఈ ఆరోపణలు వచ్చాయి. అయినా నేను బెదరను. న్యాయవ్యవస్థను బలిపశువును కానివ్వను’’ అని ఆయన స్పష్టం చేశారు. వచ్చేవారం చీఫ్‌ జస్టిస్‌ విచారించనున్న కేసుల్లో ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌, రాహుల్‌గాంధీ కోర్టు ధిక్కారం కేసు, తమిళనాడులో ఎన్నికల్లో ధన ప్రభావం కేసు, కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పెట్టుకున్న విజ్ఞప్తికి సంబంధించిన కేసు, అసోంలో జాతీయ పౌర చిట్టాపై దాఖలైన పిటిషన్‌ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ రాజకీయంగా అత్యంత కీలకమైనవి కావడం విశేషం.
 
ఇది తీవ్రమైన అంశం: ఏజీ
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అన్నారు. ‘‘ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అధికారిని నేను. ప్రభుత్వాన్ని నేను సమర్థిస్తున్నందుకు నాపై ఈమధ్య ఓ న్యాయవాది దాడి చేశారు. పేరు చెప్పదల్చుకోలేదు గానీ ఇవన్నీ ఏవో ప్రయోజనాన్ని ఆశించి చేసేవి’’ అన్నారు. న్యాయ సహాయకుడిగా వ్యవహరించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఆమె ఆరోపణలను బ్లాక్‌మెయిల్‌గా అభివర్ణించారు. ఆమె సుప్రీంకోర్టులో నాలుగు నెలల క్రితం వరకు కిందిస్థాయి క్లర్క్‌ స్థాయిలో ‘జూనియర్‌ కోర్టు అసిస్టెంట్‌’గా విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణపై ఆమెను విధుల నుంచి తొలగించారు’ అని ఆయన పేర్కొన్నారు.
 
ఉత్తర్వులివ్వని బెంచ్‌
జస్టిస్‌ గొగోయ్‌ బెంచ్‌ నుంచి వెళ్లిపోయాక మిగిలిన ఇద్దరు జడ్జీలు- జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కాసేపు ఈ అంశంపై అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌ల స్పందనలు విన్నారు. అనంతరం తాము ఈ వ్యవహారంలో ఎలాంటి న్యాయపరమైన ఉత్తర్వులివ్వబోమని స్పష్టం చేశారు. ఈ వార్తలను ఎంతవరకు ప్రచురించాలో, ఎంతవరకూ అనవసరమో మీడియా విచక్షణకే వదిలేస్తున్నట్లు చెప్పారు. అయితే అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠను దెబ్బతీసి, న్యాయవ్యవస్థ స్వతంత్రతను హరించేట్లుగా ఉన్న ఈ విశృంఖల, దురుద్దేశపూరిత ఆరోపణలను, అవాంఛిత అంశాలను ప్రచురించకుండా సంయమనం పాటిస్తే మంచిదని సూచించింది. మాజీ ఉద్యోగిని ఆరోపణను అత్యంత ముఖ్యమైన ప్రజా ప్రయోజన అంశంగా పరిగణిస్తూ విచారణకు స్వీకరించింది. ఎలాంటి ఉత్తర్వు జారీ చేయకుండానే ప్రత్యేక బెంచ్‌ విచారణను వాయిదా వేసింది.
 
‘‘ఈ దేశంలో రెండు పెద్ద వ్యవస్థలు (పదవులు) ఉన్నాయి. ఒకటి దేశ ప్రధానమంత్రి, రెండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ ఆరోపణల వెనుక ఉన్న శక్తులు అందులో సీజే పదవిని ధ్వంసం చేయాలని చూస్తున్నాయి.’’ – చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *