అది ప్రియాంక నిర్ణయమే : పిట్రోడా


జైపూర్: వారణాసిలో పోటీ చేయరాదని ప్రియాంక గాంధీ స్వయంగా నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జైపూర్‌లో శుక్రవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా ఈ విషయం తెలిపారు. ప్రియాంకకు ఇతర బాధ్యతలు ఉన్నందున కేవలం ఒక సీటుకే పరిమిత కారాదని ప్రియాంక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
 
‘అది ప్రియాంక నిర్ణయమే. తనపై పలు బాధ్యతలున్నందున ఒక సీటుకే పరిమితం కావడం సరైనది కాదని ఆమె భావించారు. పోటీకి దూరంగా ఉండాలని ఆమె తుది నిర్ణయం తీసుకున్నారు’ అని పిట్రోడా తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆదేశిస్తే ఎన్నికల్లో తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని ఇటీవల ప్రియాంక ప్రకటించడంతో నేరుగా ఆమె వారణాసి నుంచే ప్రధాని మోదీపై పోటీ చేస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు కాంగ్రెస్ గురువారంనాడు తెరదించుతూ, వారణాసి నుంచి తమ అభ్యర్థిగా అజయ్ రాయ్ పేరును ప్రకటించింది. 2014తో సహా ఐదు సార్లు అజయ్ రాయ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, శుక్రవారంనాడు వారణాసి నుంచి ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. మే 19న జరిగే తుది విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో పోలింగ్ జరుగుతుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *