అదే అమానుషం.. ప్రాంతమే మారింది.. పగ మారలా!


అహ్మద్‌నగర్: తెలంగాణలో అమృత ప్రణయ్ విషయంలో జరిగినట్టుగానే ఇక్కడా జరిగింది. అయితే… అమృత తండ్రి పంతానికి ప్రణయ్ బలయితే.. ఇక్కడ తండ్రి పంతానికి కన్న కూతురు బలయింది. ప్రియురాలి పెద్దలకు ఇష్టం లేని ప్రేమ పెళ్లి ఆ జంటను చావుబతుకుల్లోకి నెట్టేసింది. ప్రియురాలి కుటుంబ సభ్యుల క్రూరత్వం ఆమెనే పొట్టనపెట్టుకుంది. మహారాష్ట్రలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కులాంతర వివాహం చేసుకున్నారనే నెపంతో యువతిని, యువకుడిని సజీవ దహనం చేయడానికి అమ్మాయి తరపు బంధువులు యత్నించారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పర్నర్ తాలూకా నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణీ సింగ్(19), మంగేష్ రణ్‌సింగ్(23) ప్రేమించుకున్నారు. అక్టోబర్ 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే.. ఈ పెళ్లిని రుక్మిణి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. పెళ్లికి ససేమిరా అన్నారు. తమ మాటను కాదని పెళ్లి చేసుకున్నారనే పగతో యువతి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. మంగేష్ కుటుంబ సభ్యులు దగ్గరుండి మరీ ఈ పెళ్లిని ఘనంగా చేశారు. కక్షతో కడుపు తీపి చంపుకోలేకపోయిన రుక్మిణి తల్లి మాత్రం ఈ పెళ్లికి హాజరయింది.
 
అయితే.. పెళ్లి అనంతరం ఈ జంటకు రుక్మిణి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. మంగేష్‌తో చిన్న గొడవై రుక్మిణి తన పుట్టింటికి ఈ ఏప్రిల్ 30న వెళ్లింది. ఇదే అదనుగా భావించిన కుటుంబ సభ్యులు మంగేష్‌తో మాట్లాడతామని రుక్మిణితో నమ్మబలికేలా మాట్లాడారు. తనను ఇంటికి తీసుకెళ్లడానికి రావాలని రుక్మిణి ఫోన్ చేయడంతో మంగేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ ఒకే గదిలో ఉండగా.. చంపాలని పథకం రచించుకున్న ఆమె కుటుంబ సభ్యులు తలుపులు మూసేశారు. వారిపై, వారు ఉన్న గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించారు.
 
మంటల్లో కాలిపోతూ వారు అరిచిన అరుపులకు, కేకలకు ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు. 70శాతం కాలిన గాయాలతో బాధపడిన రుక్మిణిని పుణెలోని సస్సూన్ జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. 50 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న మంగేష్‌ను కూడా అదే ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి యువతి తండ్రి అదృశ్యమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *