అధికారంలోకి రాకముందే వాళ్ల హడావుడి ఇలా ఉంటే..


కోయిల ముందే కూసింది అన్న మాట ఉండనే కదా? అచ్చం అలాగే ఉంది ఆ పార్టీ నేతల తీరు. వారు అధికారంలోకి రాకముందే ఆ కార్యాలయానికి వెళ్లి వివరాలు అడిగారు. ఇసుక రీచ్‌లకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఇప్పటివరకు ఆ రీచ్‌లను ఎవరు చూశారు? వాటిని ఎవరు పాడుకున్నారు? అనే వివరాలతోపాటు ఇప్పుడు రీచ్‌లను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందే ఆ పార్టీ నేతలు చేసిన హడావుడిని చూసిన సదరు అధికారులు షాక్‌ అయ్యారట. వీరు అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటిని బిక్కుబిక్కుమంటున్నారట. ఇంతకీ ఇసుక రీచ్‌లపై హడావుడి చేసిన ఆ పార్టీ నేతలు ఎవరు? ఎక్కడ ఈ పనిచేశారు? వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలో తెలుసుకోండి.
 
   సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ఏపీలో చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్‌ ముగిసిన రెండవ రోజు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు అధికారం తమదేనన్న ధీమాను వ్యక్తంచేశాయి. వారం రోజులపాటు ఈ ఊపు కొనసాగింది. ఆ తర్వాత కాస్తంత హడావుడి తగ్గించారు. బెట్టింగ్‌ల జోరు కూడా తగ్గింది. తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఏదైతేనేమి- ఎవరి వ్యాపారాలు వారివే!
 
    తెలుగుదేశం అధికారంలోకి ఉండగా, కృష్ణాజిల్లాలో ఇసుక రీచ్‌లపై ఆరోపణలు వచ్చాయి. టీడీపీకి చెందిన నేతలే వాటిని పాడుకొని, ప్రజల నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల్పించుకున్నారు. ఇసుకపై వస్తున్న ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్న రీత్యా ఇసుకను ఫ్రీచేశారు. దీంతో ఆ ఆరోపణలపర్వం తగ్గింది.
 
   ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో తెలుగుదేశం నేతలను ఇసుకాసురులంటూ అభివర్ణించారు. ఇసుకను, మట్టిని అమ్ముకొన్నారని ఆరోపణలు గుప్పించారు. తీరా ఏపీలో పోలింగ్‌ ముగిసిన తర్వాత అధికారం తమదేనన్న ధీమాలో జగనన్న తమ్ముళ్లు దూకుడు పెంచారు. కృష్ణాజిల్లాలో ఇసుక టెండర్లు, ఇసుక రీచ్‌లను పర్యవేక్షించే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. జిల్లాకు చెందిన అయిదారుగురు నేతలు.. ముఖ్యంగా గతంలో ఇసుక రీచ్‌లతో సంబంధం ఉన్న ఆ నేతలు సదరు కార్యాలయానికి వెళ్లి “అధికారంలోకి మేమే రాబోతున్నాం” అని అధికారులకు బల్లగుద్ది మరీ చెప్పారట! ఇలా అని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఆ కార్యాలయ సిబ్బందితో మాటామంతీ కలిపి అసలు విషయం చెప్పేశారట. కృష్ణాజిల్లాలో ఇసుక రీచ్‌లకు సంబంధించిన మొత్తం సమాచారం తమకు ఇవ్వాలని కోరారట. “ఏ రీచ్‌లు పనిచేస్తున్నాయి? ఏవి పనిచేయడంలేదు? పనిచేస్తున్న రీచ్‌లు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? ఒకవేళ వాటిపై కోర్టు ‘స్టే’లుంటే, ఎవరు కోర్టుకు వెళ్లి ‘స్టే’ తీసుకొచ్చారు?” వంటి వివరాలు కావాలని హుకుం జారీచేశారట.
 
   ఆ కార్యాలయ సిబ్బంది కథనం ప్రకారం… ఆయా రీచ్‌లకు సంబంధించిన సమాచారమంతా వెబ్‌సైట్‌లో ఉంటుంది.. చూసుకోవాలని అధికారులు వారికి బదులిచ్చారు. అంతటితో వైసీపీ నేతలు శాంతించలేదు. అసలు ఆ రీచ్‌లు ఎవరు నడుపుతున్నారు? కాంట్రాక్టర్లు లేదా సొసైటీల వెనుక ఉన్న తెలుగుదేశం నేతలు ఎవరు? అన్న వివరాలు కావాలని పట్టుబట్టారు. అసలు రీచ్‌ల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో కూడా తమకు వివరాలు కావాలని అడిగారు. అయితే ఈ ప్రశ్నలకు కూడా అధికారులు తమదైన రీతిలో సమాధానమిచ్చారట. ఆ వివరాలేవీ తమకు తెలియవని తేల్చిచెప్పారట.
 
    సుమారు గంటసేపు వైసీపీ నేతలు ఆ కార్యాలయంలో హడావుడి చేసి ఆ తర్వాత వెళ్లిపోయారు. వచ్చే నెల అంటే మే 23వ తేదీన తాము అధికారంలోకి రాబోతున్నామనీ, ఆ తర్వాత ఇసుక రీచ్‌లకు సంబంధించి తమకు తెలియకుండా ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వవద్దనీ, కావాలంటే తమ పార్టీ అగ్రనేతలతో ఫోన్లు కూడా చేయిస్తామని చెప్పి మరీ వెళ్లారు. ఈ హడావుడి చూసి ఆ శాఖ అధికారులు బిత్తరపోయారు. అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే, గ్రహచారం కొద్దీ నిజంగానే గద్దెనెక్కితే పరిస్థితి ఏమిటని ఊహించుకొని వారు ఆందోళన చెందారని సమాచారం. ఈ హడావుడి గురించి ఉన్నతాధికారులకు చెప్పకపోయినప్పటికీ, ఆ శాఖ ఉద్యోగులు కొందరు వైసీపీ నేతలు హడావుడి చేసిన విషయాన్ని బయటకు లీక్‌చేశారు. ఇదండీ కృష్ణాజిల్లాలో ఇటీవల వైసీపీ నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *