అనుభవం అక్కరకొస్తోంది!


  • విపక్ష ఐక్యతకు బాబే కేంద్ర బిందువు!
  •  పటిష్ఠ కూటమికి గట్టి ప్రయత్నాలు
  •  భిన్న శిబిరాల్లోని నేతలతో సంప్రదింపులు
  •  అందరితోనూ మాట్లాడే సాన్నిహిత్యం
  •  సమావేశాల నిర్వహణలో చొరవ
  •  ‘ప్రధాని’ రేసుకు దూరమని ముందే స్పష్టీకరణ
  •  దీనివల్లే ప్రతిపక్ష నేతల్లో పెరిగిన నమ్మకం!
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర బిందువుగా మారారు. భిన్న ప్రవాహాలుగా ఉన్న ఆయా పార్టీల నేతలందరితో మాట్లాడగలిగే సాన్నిహిత్యం ఉండడం.. దానికి అవసరమైన చొరవ తీసుకోవడంతో ఆయన పాత్ర కీలకంగా మారుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ కాలంగా జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో కలిసిమెలిసి పనిచేసిన అనుభవం, రాజకీయంగా సీనియర్‌ కావడం ఆయనకు కలిసి వస్తోంది. ఎన్డీఏతో తెగతెంపుల తర్వాతి నుంచి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలతో సంబంధాలు మొదలు పెట్టారు. లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాల్లో ఎక్కువ మంది మద్దతును కూడగట్టిన నాటి నుంచి ఆయన పాత్ర పెరగడం మొదలైంది. తర్వాత ఢిల్లీలో రెండు సార్లు ప్రతిపక్షాల నేతల సమావేశాల నిర్వహణలో కూడా ఆయన చొరవ తీసుకున్నారు.
 
ఈ పార్టీలన్నీ ఒక కూటమిగా కలిసి బరిలోకి దిగాలని మొదట అనుకున్నా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ వేర్వేరుగా ఉన్న సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నాక ఆ యోచన విరమించుకున్నారు. రాష్ట్రాల్లో ఎవరు ఎలా పోటీ చేసినా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిలవాలని చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి ప్రతిపక్షాలన్నీ అంగీకారం తెలిపాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న దశలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల మధ్య ఎన్నికల పొత్తులు కుదరడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. బయటకు పెద్దగా ప్రచారం ఇవ్వకుండా ఆయా పార్టీల నేతలతో ఫోన్లలో మాట్లాడడం లేదంటే మధ్యవర్తులను పంపడం చేశారు. ఈ యత్నాలు కొన్నిచోట్ల సఫలమయ్యాయి. కొన్నిచోట్ల సఫలం కాలేదు.
 
కాంగ్రె్‌సనూ కలుపుకొనిపోతేనే..!
ప్రస్తుతం విపక్షాల్లో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. పెద్ద పార్టీ అయిన కాంగ్రె్‌సకు మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరికొన్ని పార్టీలు అనుకుంటున్నాయి. ప్రధాని రేసులో మాయావతి, మమతా బెనర్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రె్‌సకు అవకాశం వస్తే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యే అవకాశముంది. ప్రధాని పదవి విషయంలో ప్రతిపక్ష కూటమిలో చీలిక రాకుండా చూడటానికి చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రె్‌సను పక్కనపెట్టి మిగిలిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, ఆ పార్టీని కూడా కలుపుకొని వెళ్తే విపక్ష కూటమి బలంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రధాని ఎవరైనా అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఆ ప్రభుత్వం మనుగడ సాధిస్తుందన్నది ఆయన వాదన.
 
బయటి నుంచి కాంగ్రెస్‌ మద్దతు తీసుకునే ప్రయోగం గతంలో విఫలమైందని, ఆ పార్టీని కూడా కలుపుకొంటేనే బీజేపీకి వ్యతిరేకంగా సుస్థిర సర్కారును అందించగలమని.. ప్రజలకు కూడా దానిపై విశ్వాసం ఏర్పడుతుందని ఆయన దృఢంగా విశ్వసిస్తున్నారు. ఈ కోణంలోనే ఆయన ఒక పక్క రాహుల్‌తో, మరో పక్క ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాని పదవికి తాను పోటీలో లేనని ముందే అందరికీ చెప్పేయడం ద్వారా ఆయన వారందరి విశ్వాసాన్నీ చూరగొన్నారు. ఆయనతో మిగిలిన పార్టీల నేతలు మనసు విప్పి మాట్లాడడానికి ఇది ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి రెండు రోజుల ముందు ఈ నెల 21న ఢిల్లీలో ప్రతిపక్షాల నేతల సమావేశం జరుగనుంది. చంద్రబాబే చొరవతీసుకుని దీనిని సమన్వయపరిచే బాధ్యత తీసుకున్నారు.
 
రాష్ట్రంలో ప్రచారానికి ఆహ్వానం
ఏపీలో ఎన్నికల సమయంలో విపక్షాల ఐక్యతను చాటడానికి చంద్రబాబు ఇతర పార్టీల నేతలను రాష్ట్రానికి ప్రచారానికి ఆహ్వానించారు. దేవెగౌడ, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు వచ్చారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్‌ వెళ్లి ఆయన బీజేపీ వ్యతిరేక పార్టీల తరఫున ప్రచారం చేశారు. వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు అంశాన్ని ఎంచుకుని ఆ పేరుతో అన్ని ప్రతిపక్షాలను ఏకం చేయడానికీ కృషి చేశారు. ఈ అంశంపై 21 పార్టీలు కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయడం వంటి ద్వారా ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గనుందన్న సూచనలు అందుతుండడంతో బీజేపీయేతర విపక్షాలను ఏకం చేయడానికి ఆయన ముందు నుంచే పావులు కదుపుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *