అమరావతి ప్రణాళికపై అధ్యయనం


అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రణాళిక, అభివృద్ధిపై అధ్యయనం నిమిత్తం ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) ఉన్నతాధికారులతో కూడిన బృందం శుక్రవారం విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి వచ్చింది. డీడీఏ వైస్‌ చైౖర్మన్‌ తరుణ్‌ కుమార్‌ నాయకత్వంలో వచ్చిన ఈ అధికారులకు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ రాజధాని మాస్టర్‌ప్లాన్‌, నిర్మాణ విశేషాల గురించి తెలియజేశారు. ప్రణాళికా దశ నుంచే హ్యాపీ సిటీ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నామని, రాజధాని గ్రామాల రైతుల సహకారం, భాగస్వామ్యంతో అమరావతికి అవసరమైన భూమిని సమీకరణ ప్రాతిపదికన దిగ్విజయంగా సేకరించ గలిగినట్లు తెలిపారు. అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న ఈ నగరంలో తొమ్మిది థీమ్‌ సిటీలు, సువిశాల రహదారులు, ప్రతిష్టాత్మక కట్టడాలు ఇత్యాదివి రానున్నాయన్నారు.
 
ప్రభుత్వ గృహసముదాయం, సెక్రటేరియట్‌ అండ్‌ హెచ్‌వోడీ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, వివిధ విశ్వవిద్యాలయాలు, హ్యాపీనెస్ట్‌ తదితర నిర్మాణాలతోపాటు పలు సంస్థల ఏర్పాటు గురించిన వివరాలను సచిత్రంగా తెలియజేశారు. అమరావతి ఆర్థిక ప్రణాళిక గురించి సీఆర్డీయే స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు, డ్రోన్‌ టెక్నాలజీతో అభివృద్ధి పరచిన డిజిటల్‌ ట్విన్‌ ప్లాట్‌ఫాం విధానంలో జరుగుతున్న నిర్మాణ విశేషాలను అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌, భూసమీకరణ పథకం అమలు తీరును ఏపీడీఆర్‌ఐ అడ్వైజర్‌ ఆర్‌.రామకృష్ణారావు వివరించారు.
 
డీడీఏ బృందంలో ఫైనాన్స్‌ మెంబర్‌ వినాయకరావు, ప్లానింగ్‌ డైరెక్టర్లు రాజేష్‌ కె.జైన్‌, సుధీర్‌కుమార్‌ కెయిన్‌, ల్యాండ్‌ స్కేప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కల్పనా ఖురానా, హార్టీకల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్‌.డి.మీనా, ఆర్కిటెక్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ స్మితా సక్సేనా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్బన్‌ అఫైర్స్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ నీలేష్‌ రాజాధ్యక్ష, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ కనక్‌ తివారీ ఉన్నారు. ఈ సమావేశంలో సీఆర్డీయే డైరెక్టర్లు వై.నాగిరెడ్డి (ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌), జి.నాగేశ్వరరావు (ప్లానింగ్‌), బి.ఎల్‌.చెన్నకేశవరావు (ల్యాండ్స్‌), సీఈలు టి.ఆంజనేయులు, ఎం.జక్రయ్య, జె.శ్రీనివాసులు, ఎస్టేట్స్‌ జాయింట్‌ సీహెచ్‌ మోహనరావు, టీఅండ్‌టీ ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, ఏడీసీ ఇన్‌ఫ్రా విభాగాధిపతి డాక్టర్‌ గణేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం డీడీఏ అధికారుల బృందం అమరావతిలో పర్యటించి, అందులో నిర్మాణదశల్లో ఉన్న వివిధ ప్రాజెక్టులతోపాటు మౌలిక వసతుల కల్పన పథకాల అమలు తీరుతెన్నులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *