అయిందేదో అయింది!


  • సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్‌ నేత శాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఈ ఐదేళ్లలో బీజేపీ ఏం చేసిందని నిలదీత
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ
  • కాంగ్రెస్‌ వైఖరికిది నిదర్శనమని ఆగ్రహం
  • పిట్రోడా వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న కాంగ్రెస్‌
న్యూఢిల్లీ, మే 10: ‘‘జరిగిందేదో జరిగింది (హువా తో హువా).. అయితే ఏంటి’’ ..1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలివి. గురువారం ఒక ఆంగ్లచానల్‌తో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోవిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా హరియాణాలోని రోహ్‌తక్‌లో ఉన్న మోదీ.. పిట్రోడా వాఖ్యలనే తన ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ అహంకారాన్ని తెలియజేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘హువా తో హువా.. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై కాంగ్రె్‌సలోని అత్యంత సీనియర్లయిన నేతలలో ఒకరు చేసిన వాఖ్యలోని ఈ 3 పదాలు ఆ పార్టీ అహంకారానికి నిదర్శనం. ఈ అహంకారంతోనే కాంగ్రెస్‌ దేశాన్ని పాలించింది.’’ అని మోదీ ధ్వజమెత్తారు.
 
‘‘ఇది ఒక నిర్ణీత నేత చేసిన వ్యాఖ్య కాదు. అది కాంగ్రెస్‌ మనస్తత్వాన్ని ప్రతిఫలింపజేసే వ్యాఖ్య. చాలాకాలంగా వాళ్లు చేస్తున్నదిదే. ‘ఒక మహావృక్షం కూలినప్పుడు భూమి కంపిస్తుంది’ అని రాజీవ్‌గాంధీ అన్నారు’’ అని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్య చేసిన పిట్రోడా రాజీవ్‌కు అత్యంత సన్నిహితుడని.. కాంగ్రెస్‌ అధ్యక్షుడికి గురువని పేర్కొన్నారు. కాగా ‘‘సిక్కులపై 1984లో జరిగిన హత్యాకాండను కొట్టిపారేసిన తన గురువును కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొలగించగలరా?’’ అని అరుణ్‌జైట్లీ ట్విటర్‌లో నిలదీశారు. పిట్రోడా చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలపై సోనియా, రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని జావడేకర్‌ అన్నారు. కాగా, పార్టీలోని నేతలందరూ జాగ్రత్తగా, సున్నితంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం హెచ్చరించింది. పిట్రోడా సహా దేశంలో ఎవరు ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా అది వారి వ్యక్తిగతమే తప్ప పార్టీ అభిప్రాయం కాదని స్పష్టం చేసింది.
 
క్షమించండి: పిట్రోడా
హిందీ సరిగ్గా రాకపోవడంతో మనసులో ని విషయాన్ని సరిగ్గా వ్యక్తీకరించలేకపోయానని.. ‘జరిగింది చెడు పరిణామమే (జో హువా వో బురా హువా)’ అనాలన్నది తన ఉద్దేశమని, ఆ సమయంలో ‘బురా’ అనే పదం గుర్తురాలేదని పిట్రోడా పశ్చాత్తాపం వెలిబుచ్చారు. తన మాటలను వక్రీకరించినందుకు చింతిస్తున్నానన్న ఆయన.. క్షమాపణ కోరారు.
 
పిట్రోడా క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్‌
సిక్కుల ఊచకోతపై శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని.. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ అన్నారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు విషాదమని.. బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు శిక్షపడాల్సిందేనని అన్నారు. ‘‘1984లో జరిగింది భయంకరమైన విషాదం, అది జరిగి ఉండకూడదని.. మా వైఖరిని మేం ఇంతకుముందే విస్పష్టంగా చెప్పాం’’ అని గుర్తుచేశారు.
 
పిట్రోడా అసలేమన్నారు?
సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి విలేకరి ప్రశ్నించినప్పుడు.. ‘‘1984 సంగతి గురించి ఇప్పుడెందుకు? ఈ ఐదేళ్లలో మీరేం చేశారో చెప్పండి. 1984లో జరిగిందేదో జరిగింది. మీరేం చేశారు?’’ అని పిట్రోడా అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *