ఆత్మహత్య చేసుకుంటానన్న వ్యక్తికి సుష్మా స్వరాజ్ అండ


న్యూఢిల్లీ : ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సామాజిక మాధ్యమాలను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అనేక మందికి సహాయపడుతూ ప్రజాదరణ పొందుతున్నారు. అదే వైఖరిని కొనసాగిస్తూ గురువారం ఆమె ఇద్దరు భారతీయులకు గట్టి భరోసా ఇచ్చారు. వీరిలో ఒకరు అమెరికాలోనూ, మరొకరు సౌదీ అరేబియాలోనూ ఉంటున్నారు.
 
సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉంటున్న అలీ ఓ సంవత్సరం నుంచి అక్కడి భారతీయ దౌత్య కార్యాలయాన్ని సహాయం కోరుతున్నారు. తనకు తిరిగి భారత దేశం వెళ్ళడానికి సహాయపడాలని అలీ కోరుతున్నారు. కానీ తనకు తగిన స్పందన కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదని ఆయన ట్వీట్ చేశారు.
 
ఈ ట్వీట్‌పై సుష్మా స్వరాజ్ స్పందించారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన చేయరాదని అలీకి ట్వీట్ చేశారు. ‘‘నేనున్నాను’’ అంటూ భారతీయ దౌత్య కార్యాలయం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అలీ విషయంలో పూర్తి నివేదికను తనకు పంపించాలని రియాద్‌లోని భారతీయ దౌత్య కార్యాలయాన్ని ఆదేశించారు.
 
అమెరికాలోని క్షితిజ్ ఓ ట్వీట్‌లో ఓ ముఖ్యమైన సమస్యను ప్రస్తావించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ పాత పద్ధతుల్లో రుసుముల చెల్లింపును డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. డాక్యుమెంట్ల అటెస్టేషన్ కోసం మనియార్డర్ లేదా క్యాషియర్స్ చెక్ ద్వారా రుసుమును చెల్లించాలని ఇండియన్ కాన్సులేట్ కోరుతోందని చెప్పారు. ఈ డిజిటల్ యుగంలో పాత పద్ధతులేమిటని ప్రశ్నించారు. కనీసం కార్డునైనా అంగీకరించాలని కోరారు. భారతదేశంలో కార్డులను అనుమతిస్తూ, అమెరికాలో ఎందుకు కాదంటున్నారని ప్రశ్నించారు.
 
దీనిపై సుష్మా స్వరాజ్ స్పందిస్తూ తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాల చెప్పారు. తాను దీనిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *