ఆయన సినిమా సైనికుడు… నేను నిజమైన సైనికుడిని…


ఛండీగఢ్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. గురదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్న బాలవుడ్ నటుడు సన్నీడియోల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన ‘సినిమా సైనికుడు’ మాత్రమేనని అన్నారు. ఈ మేరకు అమరీందర్ సింగ్ ఓ ట్వీట్ చేశారు.
 
‘ఆయన (సన్నీడియోల్) సినిమా సైనికుడు. నేను నిజమైన సైనికుడిని. మేము ఆయనను ఓడిస్తాం. ఆయన వల్ల సునీల్ జాఖర్‌కు (కాంగ్రెస్ అభ్యర్థి-గుర్‌దాస్‌పూర్) కానీ, కాంగ్రెస్‌కు కానీ ఎలాంటి ఇబ్బందీ లేదు’ అని అమరీందర్ సింగ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. గుర్‌దాస్‌పూర్ ప్రజల కోసం జాఖర్ పనిచేశారని, సన్నీడియోల్‌కు ఆ నియోజక వర్గం ప్రజల సపోర్ట్ లేదని చెప్పారు.
 
కాగా, 1997లో వచ్చిన ‘బోర్డర్’ చిత్రంలో సైనికుడిగా సన్నీడియోల్ నటించారు. గతవారంలో ఆయన బీజేపీలో చేరారు. వెంటనే ఆయనను గుర్‌దాస్‌పూర్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. అక్కడ్నించి కాంగ్రెస్ సీనియర్ నేత జాఖర్ పోటీలో ఉన్నారు. జాఖర్ శుక్రవారంనాడు గురుదాస్‌పూర్‌లో అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆయన వెంటే ఉన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *