ఆ రైలును అవుటర్‌లో ఆపొద్దు..


  • డెల్టా ఎక్స్‌ప్రెస్‌ని తెనాలి అవుటర్‌లో నిలిపేయొద్దు
  • విజయవాడ డీవోఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): నిత్యం రాత్రి వేళ రేపల్లె – సికింద్రాబాద్‌ మధ్య నడిచే నెంబరు. 17626 డెల్టా ఎక్స్‌ప్రెస్‌ని తెనాలి రైల్వేస్టేషన్‌ అవుటర్‌లో నిలిపేస్తుండటంపై అందిన ఫిర్యాదుల మేరకు విజయవాడ డీవోఎం ఆంజనేయలు స్పందించారు. ఆ రైలుని అవుటర్‌లో నిలపకుండా కుదిరితే నెంబరు. 1 లేక 5వ ప్లాట్‌ఫారంలోకి తీసుకోవాలని తెనాలి రైల్వేస్టేషన్‌ అధికారులకు నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఈ విషయంపై జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు ఉప్పులూరి శశిధర్‌ చౌదరి ఫోన్‌ ద్వారా సమస్యని డీవోఎంకి నివేదించారు. రేపల్లె, భట్టిప్రోలు, వేమూరు, పల్లెకోన, చినరావూరు ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లేందుకు డెల్టా ఎక్స్‌ప్రెస్‌ని కనెక్టింగ్‌ ట్రైన్‌గా భావిస్తారు. ఈ రైలు ద్వారా తెనాలికి వచ్చి అక్కడి నుంచి నెంబరు. 12734 లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయలుదేరి వెళతారు. అయితే డెల్టా ఎక్స్‌ప్రెస్‌ని అరగంటకు పైగా తెనాలి అవుటర్‌లో నిలిపేయడం వలన వీళ్లు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ని అందు కోలేకపోతోన్నారు. తెనాలిలో ఐదో నెంబరు ప్లాట్‌ఫాం ఖాళీగా ఉంటేనే డెల్టా ఎక్స్‌ప్రెస్‌ని తీసుకుంటున్నారు. తెనాలి నుంచి గుంటూరు మార్గంలోకి పంపేందుకు కూడా ఎక్కువ సమయం పడుతోంది. ఈ విషయాన్ని శశిధర్‌చౌదరి విజయవాడ డీవోఎంకి నివేదించడంతో ఆయన వెంటనే స్పందించి గురువారం సాయంత్రం తెనాలి ఎస్‌ఎస్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచే డెల్టా ఎక్స్‌ప్రెస్‌ని అవుటర్‌లో నిలిపేయొద్దని స్పష్టం చేశారు.
 
వేగం పెరిగేదెప్పుడు?
గుంటూరు – తెనాలి మధ్యన రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినా ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్ల వేగం పెరగడం లేదు. నేటికీ మెయిన్‌లైన్‌లో 70 కిలోమీటర్లు, స్టేషన్‌ యార్డుల పరిధిలో 30 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అనుమతిస్తోన్నారు. దీని వలన ప్రయాణ సమయం 40 నిమిషాల వరకు పడుతుంది. గతంలో సింగిల్‌ లేన్‌గా ఉన్నప్పుడు 25 నిమిషాల వ్యవధిలో రైళ్లు గుంటూరుకు చేరుకొనేవి. డబుల్‌ లేన్‌ అయిన తర్వాత ఈ సమయం 20 నిమిషాలకు తగ్గుతుందని అంతా ఆశించగా సమయం పెరగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆర్‌వీఎన్‌ఎల్‌ సంస్థ పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు చేయక పోవడమేనన్న ఆరోపణలు వస్తోన్నాయి. ఇంకా పెండింగ్‌ పనులు ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతోన్నాయి. దీనికి తోడు గత శనివారం వేజండ్ల రైల్వేస్టేషన్‌లో గుంటూరు – ఒంగోలు ప్యాసింజర్‌ రైలుకు అసాధారణ రీతిలో విద్యుత్‌ఘాతం జరిగి ముగ్గురు ప్రయాణీకులు గాయపడ్డారు. దాంతో వేజండ్లలో నేటికీ ఒకటో నెంబరు లైను వినియోగంలోకి తీసుకురాలేదు. ఈ లోపాలన్నింటిని సరిదిద్దాలని రైల్వే యూజర్స్‌ కోరుతోన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *