ఆ విషయాల్లో ఆ రెండు పార్టీలూ ఒకటే : మోదీ


బెంగళూరు : కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీల వ్యవహార శైలిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలకు వారసత్వ రాజకీయాలు, అవినీతి అంశాల్లో మాత్రమే ఏకాభిప్రాయం ఉంటుందన్నారు.
 
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న మోదీ గురువారం కర్ణాటకలోని చిక్కోడిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రతి అంశంలోనూ విభేదిస్తాయని, అయితే వంశపారంపర్య పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతి విషయంలో మాత్రం ఆ రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో మెలగుతాయని చెప్పారు. అంతేకాకుండా జాతీయవాదం గురించి, తన గురించి చెడుగా మాట్లాడతాయని చెప్పారు.
 
కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ కుమార స్వామి ఇటీవల చేసినట్లు ప్రచారమవుతున్న వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ‘‘రెండు పూటలా భోజనానికి లేనివారే సైన్యంలో చేరుతార’’ని కుమార స్వామి అన్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ మాట్లాడుతూ, ‘‘ఆకలితో అలమటించేవారే సైన్యంలో చేరుతారని ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ కుటుంబాన్ని (దేవె గౌడ కుటుంబాన్ని) ప్రజా జీవితం నుంచి బయటకు తోసేయాలి’’ అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికి గౌరవం దక్కబోతోందో ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. ‘‘భారత్ మాతా కీ జై అనేవారికి గౌరవం దక్కుతుందా? ‘ముక్కలు ముక్కలు చేయాలి’ అనేవారికి గౌరవం దక్కుతుందా? అనేది మీ ఓటే నిర్ణయిస్తుంది’’ అని మోదీ అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *