ఇంటలిజెన్స్‌ నివేదికలో ఆ పార్టీకే విజయావకాశాలు..!


బెంగళూరు: ఎన్నికల్లో విజయంపై బీజేపీ, జేడీఎస్‌ తమ తమ ఊహాగానా ల్లో విహరిస్తున్నాయి. ఈ సందర్భంగా బీఎస్‌ యడ్యూరప్ప మాట్లాడుతూ, తమ అంచనాలకు తగినట్టే ఫలితాలు రాబోతున్నాయన్నారు. ఈ సారి కర్ణాటకలో హేమాహేమీలైన కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కాగా ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి బెంగళూరులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొన్ని నియోజకవర్గాల్లో మినహా మొత్తంమ్మీద కాంగ్రెస్‌, జేడీఎస్‌ పొత్తు బాగా పనిచేసిందన్నారు. ఫలితంగా అనేక నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించబోతున్నామన్నారు.
 
అదే సమయంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కార్యకర్తల మధ్య గందరగోళాన్ని పూర్తిస్థాయిలో నివారించడంలో ఉభయ పార్టీల నేతలు కొంత మేరకు విఫలమైన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. రానున్న రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలబోతున్నదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. దాదాపు ఎనిమిది నెలల కాలంగా ఇలాంటి వ్యాఖ్యలను తాను వింటూనే ఉన్నానన్నారు. మే 23 తర్వాత రాష్ట్రంలో యథాస్థితి కొనసాగుతుందని సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు గుల్బర్గాలో బుధవారం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్‌ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గె తన గెలుపుపై అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పోటీ తీవ్రంగానే ఉన్నా గెలుపు తనదేనన్నారు.
 
గుల్బర్గాలోని తన నివాసంలో ఆయన పార్టీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలతో పోలింగ్‌ సరళిపై సమీక్ష నిర్వహించారు. తమకు అందిన సమాచారం ప్రకారం భారీ మెజార్టీతో తాను గెలుపు సాధించనున్నట్లు చెప్పారు. చించోళి శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 25న కేపీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ పదాధికారుల సమావేశం జరుగుతుందని అందులో అభ్యర్థి పేరును ఖరారు చేస్తామన్నారు. కాగా ఖర్గె బుధవారం సాయంత్రం ఢిల్లీకి తరలివెళ్ళారు. 26న షిరిడిలోనూ, అహమదాబాద్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థుల తరుపున ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు.
 
ఇంటలిజెన్స్‌ నివేదికలో బీజేపీకే అనుకూలం?
రాష్ట్రంలో రెండుదశల పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం బీజేపీకే మొగ్గు ఉందని ఇంటలిజెన్స్‌ వర్గాలు వెల్లడించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. తొలిదశలో కంటే మలిదశలోనే బీజేపీకి ఆశాదాయక పరిస్థితి ఉన్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీకి 16 నుంచి 18 లోపు స్థానాలు దక్కే అవకాశం ఉందని ఇంటలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *