ఈసారి ఏపీ సీఎం ఎవరంటూ అక్కడికి క్యూ కట్టేస్తున్న నేతలు?


దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల పైనే ఉంది. ఏపీ సీఎం చంద్రబాబుకీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకీ మధ్య చిచ్చు రాజుకోవడంతో.. ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది. దీంతో కౌంటింగ్‌ రోజున ఏమవుతుందో అన్న టెన్షన్‌ చాలా మందిలో నెలకొన్నది. ఈ పరిస్థితి జ్యోతిష్కులకు బాగా కలిసివస్తోంది. వాళ్లను ఆశ్రయిస్తున్న వారు సొంత జాతకాలు చెప్పించుకోవడం మానేసి.. పార్టీల అధినేతల జాతకాలు అడుగుతున్నారట. ఆ సంగతులేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
 
    ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఫలితాలపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఎన్నికలకి ముందే టీడీపీ, బీజేపీల మధ్య యుద్ధం మొదలుకావడం అనూహ్య పరిణామం అయితే, ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ, టీఆర్‌ఎస్‌ పెద్దలు అండదండలు అందించడం, జనసేన పార్టీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం, వందేళ్లు దాటిన కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఏపీలో అనామకులు బరిలో నిలుచునే పరిస్థితి రావడం అనే అంశాలు ఎంతో ఉత్కంఠను కలిగించాయి.
 
   దీంతో పోలింగ్‌ ముగిసిన మర్నాటినుంచి ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. అయినప్పటికీ లోలోపల ఏదో ఒక సందిగ్ధం. ఏపీలో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రి కుర్చీ దక్కేది ఎవరికి? ఈ ప్రశ్నల చుట్టూ అందరి అంచనాలు కొనసాగుతున్నాయి. “ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మా పార్టీయే. మా జగనన్నే సీఎం..” అంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. “ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి కావాల్సిన సమర్థ నేత చంద్రబాబునాయుడే. ఈ ఎన్నికల్లో గెలిచేది మేమే” అంటూ టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. “టీడీపీ లేదా వైసీపీలకు ఆక్సిజన్ కావాలంటే మా పార్టీయే కీలకం అవుతుంది” అని జనసేన పెద్దలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఎటూ పాలుపోని నాయకులు, కార్యకర్తలు, ఆయా పార్టీల అభిమానులు గుట్టుచప్పుడు కాకుండా జ్యోతిష్యాలు చెప్పే పంతుళ్లను ఆశ్రయిస్తున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే చెప్పండి అంటూ వారిని ప్రశ్నిస్తున్నారు.
 
   ఇటీవలి కాలంలో జ్యోతిష్యాన్ని నమ్మేవారి సంఖ్య కొంత పెరుగుతోంది. బడాబడా వ్యాపారులు, రాజకీయ నాయకులకు అయితే ఫ్యామిలీ డాక్టర్ల మాదిరే ఫ్యామిలీ జ్యోతిష్కులు, సిద్ధాంతులు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ సంక్లిష్టత సమసిపోయి ఒక స్పష్టత రావడం కోసం వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు జ్యోతిష్యుల వద్దకి వెళుతున్నారు. “అయ్యా.. పంతులుగారు ఈసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఎవరికుందో కాస్త వివరంగా చెప్పండి..” అని అడుగుతున్నారు.
 
   జ్యోతిష్య పండితులు సైతం ఈ పరిస్థితిని బాగానే క్యాష్‌ చేసుకుంటున్నట్టుగా వినికిడి! కొందరయితే సందర్భశుద్ధిని ప్రదర్శించి, వచ్చిన నేతల చెవులకు ఇంపుగా ఉండే నాలుగు మాటలు చెప్పి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారట. తిథులు, వారాలు, గడియలు లెక్కేసి.. జాతకాలు తిరగేసి.. చక్రాలు గట్రాలు పేపర్ల మీద గీసి.. “ఎవరికి రాజయోగం ఉందో” ఇట్టే చెబుతున్నారట. సదరు నేత ఫలానా తేదీన, ఫలానా స్థలంలో ప్రమాణస్వీకారం చేస్తారంటూ తేల్చేస్తున్నారట. ఈ విషయాలు ఆయా నేతలకే పరిమితమైతే ఫర్వాలేదు. జ్యోతిష్య పండితులు చెప్పింది నమ్మే నాయకులు, కార్యకర్తలు ఆ అంశాలను సోషల్‌ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక ప్రధాన పార్టీకి చెందిన అధినేత జ్యోతిష్య చక్రంపై విశాఖలో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది.
 
   సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పోస్టులో జగన్‌ గెలుస్తారంటూ భారీ ప్రచారం జరుగుతోంది. అక్కడితో ఆగకుండా అందులో ముహూర్తం కూడా పేర్కొనడం గమనార్హం. మే 25వ తేదీ వైశాఖ బహుళ సప్తమి తత్కాల అష్టమి.. ఆదివారం ఉదయం 9 గంటల 29 నిముషాలకు, ధనిష్ట నక్షత్రయుక్త కర్కాట లగ్నంలో సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేస్తారన్నది అందులోని సారాంశం. అయితే ఈ అంశాన్ని కొందరు జ్యోతిష్య పండితులు కొట్టిపారేస్తున్నారు. జగన్‌ జాతకాన్ని పరిశీలిస్తే అతనికి కాలం కలిసిరావడం లేదన్నది వారి విశ్లేషణ. గ్రహస్థితి కారణంగా మొండితనం, అంతా తనకే తెలుసుననే విపరీత ధోరణి, ఎవరినీ నమ్మకపోవడం అనే లక్షణాలు జగన్‌లో ఉన్నాయనీ, వాటివల్ల ఆయనకి ఎప్పుడూ ప్రతికూలతే ఉంటుందనీ కొందరు జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన ఓటర్లను బలంగా తనవైపు తిప్పుకోలేకపోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.
 
    జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న పెద్దలు మాత్రం ఏపీకి మరోసారి సీఎం అయ్యేది చంద్రబాబే అని విస్పష్టంగా చెబుతున్నారు. అదెలా అని ఎవరైనా అడిగితే.. “రాజయోగం ఉన్నవాడు మాత్రమే ఆ పదవిని చేజిక్కించుకోగలడు. అటువంటి రాజయోగం చంద్రబాబుకే ఉందని” వారు వివరిస్తున్నారు. ఈసారి ఏపీ ముఖ్యమంత్రి పీఠానికి పోటీపడిన ముగ్గురు నేతలు చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌కల్యాణ్‌. ఈ ముగ్గురు జాతకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే జగన్, పవన్‌ల కంటే మెరుగైన జాతకం చంద్రబాబుదే అని మెజారిటీ జ్యోతిష్య పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే, మరోపక్క సంక్షేమ పథకాల ద్వారా చంద్రబాబు ప్రజల మన్ననలు పొందుతున్నారని వారు గుర్తుచేస్తున్నారు. ఈ మాటలు విపక్షాలకు రుచించకపోయినా.. టీడీపీ నేతలకు మాత్రం పరమానందం కలిగిస్తున్నాయి.
 
    చంద్రబాబుకి ఉన్న జాతక మహాత్యాలు ఆయనను ఎన్నో సవాళ్ల నుంచి గట్టెక్కించిందని మరికొందరు సిద్ధాంతుల విశ్లేషణ! క్లిష్టమైన సమయాల్లోనూ ఆత్మనిబ్బరంతో నెగ్గుకు రాగల తత్వం చంద్రబాబు సొంతమని వారు చెప్పుకొస్తున్నారు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన రాజకీయ నాయకుడిగా ఆయనను అభివర్ణిస్తున్నారు. చంద్రబాబులో ఉన్న ఈ స్వభావాలన్నీ ఆయన జాతకచక్రం మహిమలేనని వారు స్పష్టంచేస్తున్నారు.
 
   ఇక జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జాతకాన్ని కూడా కొందరు సిద్ధాంతులు విశ్లేషిస్తున్నారు. గ్రహస్థితి కారణంగా ఆయన ఆలోచనలకు, ఆవేశానికి మధ్య ఎక్కడో లింక్‌ తెగిపోతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతరులకు ఉపయోగపడే అవకాశాలే ఆయన జాతకంలో ఎక్కువగా ఉన్నాయంటున్నారు. జ్యోతిష్య పండితులు చెబుతున్న ఈ మాటల్లో ఎన్ని నిజమవుతాయి? ఎన్ని గాలి మాటలుగా మిగులుతాయి? అన్న విషయం తేలాలంటే ఫలితాల రోజు వరకూ ఆగాల్సిందే. అయితే అప్పటివరకూ ఆగలేని వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు మాత్రం ఈ జోస్యాలను అడ్డుపెట్టుకుని రకరకాల చర్చలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సారి పోలింగ్‌కీ, కౌంటింగ్‌కీ మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉంది. ఈ సమయంలో రోజులు గడవాలంటే ఇలాంటి కబుర్లు- కాకరకాయలు వారికి ఎంతో అవసరం మరి!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *