ఈ కన్నీళ్లకు బదులేది?


ముంబై: పాతికేళ్ల జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానయాన ప్రస్థానానికి బ్రేక్‌ పడింది. నిర్వహణకు అవసరమైన నిధులు కూడా లేక బుధవారం అర్థ రాత్రి నుంచి కంపెనీ విమాన సర్వీసులన్నీ నిలిచి పోయాయి. బుధవారం రాత్రి 10.30 గంటలకు అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి ఆఖరి జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం నడిచింది. ఇది తాత్కాలికమేనని చెబుతున్నా, కంపెనీ పునరుద్ధరణపై పెద్దగా ఆశలు కుదరడం లేదు. అన్ని బకాయిలను కూడా కలుపుకుంటే కంపెనీపై చెల్లింపుల భారం రూ.20,000 కోట్ల వరకు ఉంది.
 
అందులో ఇప్పటికిప్పుడు కనీసం రూ.2,000 కోట్లు చేతిలో ఉంటేగానీ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మళ్లీ గాల్లోకి ఎగిరేందుకు వీలుపడదు. దీంతో 20,000 ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. రుణ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణ చేపట్టిన బ్యాంకులు, కంపెనీ నిర్వహణకు అత్యవసరంగా రూ.400 కోట్ల అప్పులు ఇచ్చేందుకూ నిరాకరించాయి. ఎస్‌బీఐ ఇందుకు సుముఖంగా ఉన్నా, మిగతా బ్యాంకులు వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదన ఆగిపోయిందని సమాచారం.
 
ఢిల్లీ, ముంబై నగరాల్లో జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు గురువారం ఆందోళన బాట పట్టారు. రోడ్ల మీదికొచ్చి ‘సేవ్ జెట్ ఎయిర్‌వేస్’ అని ముక్తకంఠంతో నినదించారు. తమ కుటుంబాలను కాపాడాలంటూ రోదించారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగ భయం జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులను వెంటాడుతోంది. ఒక్కొక్కరిది ఒక్కో కథ. తీరని వ్యధ. గత కొద్ది నెలలుగా జీతాలు లేక అష్టకష్టాలు పడుతున్న తమకు ఇప్పుడు ఉద్యోగమే ఉండదనే భయం పట్టుకుందని ఓ సీనియర్ ఉద్యోగి కన్నీరుమున్నీరయ్యాడు. తన వయసు 50 సంవత్సరాలని, 26ఏళ్ల వయసులో జెట్ ఎయిర్‌వేస్‌లో చేరానని.. ఇప్పుడు తనకు వేరే సంస్థల్లో ఉద్యోగం దొరకడం కూడా కష్టమేనని ఆయన రోదించారు.
 
ఇదే ఎయిర్‌వేస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తోన్న సునీల్ కుమార్ మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడంతో పూట గడవడం కూడా కష్టంగా ఉందని, తన పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశాడు. జెట్‌ ఎయిర్‌వేస్‌లో డ్రైవర్లు, లోడర్స్‌గా పనిచేస్తున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇంటి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని.. పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించడానికి డబ్బు లేని పరిస్థితి నెలకొందని రాజీవ్ కుమార్ అనే దిగువ స్థాయి ఉద్యోగి తెలిపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 20వేల మంది ఉద్యోగులు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ తిరిగి సేవలందించాలని.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *