ఉగ్ర స్థావరాలపై డేగ కన్ను!


  • ఈనెల 22న రీశాట్‌-2బీ ప్రయోగం
  • పీఎస్‌ఎల్వీ-సీ46 ద్వారా నింగిలోకి
  • దేశ భద్రతే లక్ష్యంగా ఐదు ఉపగ్రహాలు
  • ఈ ఏడాది ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు
శ్రీహరికోట (సూళ్లూరుపేట), మే 12: దేశానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన వంతు సహకారం అందిస్తోంది. దేశ సరిహద్దుల్లో ఉగ్రమూకల కదలికలను పసిగట్టి ఆ సమాచారాన్ని రక్షణ రంగానికి అందించేందుకు ఈ ఏడాది ఐదు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. అందులో భాగంగా ఈ నెల 22న ఉదయం 5.27 గంటలకు అత్యాధునిక రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ రీశాట్‌-2బీని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో రాకెట్‌ అనుసంధానాన్ని పూర్తి చేసింది. ఈ ఉపగ్రహం దట్టమైన మబ్బుల మాటు నుంచే కాదు.. ప్రతికూల వాతావరణంలో సైతం భూమిపై ఉన్న దృశ్యాలను స్పష్టంగా తీసి పంపిచగలదు.
 
ఈ ఏడాది ఐదు ప్రయోగాలు
సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఈ ఏడాది ఈ ఏడాది ఐదు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. తొలుత ఈ నెల 22న రీశాట్‌-2బీని ప్రయోగించనుంది. జూన్‌లో పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌ ద్వారా కార్టోశాట్‌-3, జూలైలో రీశాట్‌-2బీఆర్‌-1, అక్టోబరులో రీశాట్‌-2బీఆర్‌-2, నవంబరులో రీశాట్‌-1ఎ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించే ఏర్పాటు చేస్తోంది. ఈ ఐదు ఉపగ్రహాలు దేశ సరిహద్దులను అనుక్షణం కాపలాకాస్తూ ఎప్పటికప్పుడు ఆ ప్రాంత చాయాచిత్రాలను అందిస్తుంటాయి. అలాగే 2020లో రీశాట్‌-2ఎను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. ఈ ఆరు ఉపగ్రహాలు.. ఉగ్రవాదుల చిత్రాలతోపాటు వారి ఆయుధ సామాగ్రి, బంకర్ల చిత్రాలను సైతం క్లిక్‌మనిపించి రక్షణ రంగానికి అందిస్తాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *