ఉడికిన కోస్తా


  • వడదెబ్బకు 29మంది మృతి.. నెల్లూరులో అత్యధికంగా 8మంది
  • తీవ్ర వడగాడ్పులతో అల్లాడిన జనం
  • దూపాడులో 47.08 డిగ్రీలు నమోదు
  • 3- 6 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు
  • మరో వారం ఇంతే: వాతావరణ శాఖ
విశాఖపట్నం/అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వడగాడ్పులతో కోస్తా ఉడికిపోయింది. ఎడారి గాలులతో ఉదయం నుంచే వాతావరణం వేడెక్కింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47డిగ్రీలు దాటాయి. ఎండ, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. వడదెబ్బకు గురై రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 23మంది మృతిచెందారు. వీరిలో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 8మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున ఉన్నారు. దక్షిణ కోస్తాలో గాడ్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. గ్రానైట్‌, ఇతర గనులు తవ్వే ప్రాంతాలు, కొండప్రాంతాల్లో మధ్యభారతంలో మాదిరిగా ఎండ తీవ్రత నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3- 6 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడులో అత్యధికంగా 47.08 డిగ్రీలు, ముండ్లమూరు మండలంలో 46.51, పెదచెర్లోపల్లిలో 46.41డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో 46- 48డిగ్రీలు, 42చోట్ల 45- 46డిగ్రీలు, 85 చోట్ల 44- 45డిగ్రీలు, 480 ప్రాంతాల్లో 41- 44డిగ్రీల మధ్య నమోదైనట్లు ఆర్టీజీఎస్‌ తెలిపింది. శనివారం కూడా కోస్తా, రాయలసీమలో పలు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ, ఆర్టీజీఎస్‌ హెచ్చరించాయి.ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 46-47డిగ్రీలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 43-45డిగ్రీలు, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో 39-42డిగ్రీల మేర నమోదు కావొచ్చని అంచనా వేశాయి. కోస్తాలో మరో వారంరోజుల వరకు గాడ్పులు, ఎండ తీవ్రత కొనసాగుతాయని వాతావరణ శాఖ విడుదల చేసిన వారాంతపు బులెటిన్‌లో హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు.
 
కోస్తా, రాయలసీమకు వర్షసూచన
దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఒడిశా నుంచి ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *