ఉత్తరప్రదేశ్‌లో మోదీ ప్రభంజనం లేదు


  • సామాజిక సమీకరణలే కీలకం
  • పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కనిపించిన మోదీ ప్రభంజనం ఇప్పుడు లేదని పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో తేలిపోయింది! ఫలితంగా.. గత ఎన్నికలతో పోలిస్తే అక్కడ బీజేపీ అత్యధిక స్థానాలు కోల్పోయే అవకాశాలున్నాయని వెల్లడైంది. 2014లో బీజేపీ 73లోక్‌సభ స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 41.35ు ఓట్లతో 325 స్థానాలు గెలుచుకుంది. కానీ ఈసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ.. రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పొత్తు పెట్టుకుని బలమైన కూటమిగా రంగంలోకి దిగాయి. అటు మునుపటి హవా తగ్గడంతో, బీజేపీ యూపీలో దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువని పీపుల్స్‌ పల్స్‌ విశ్లేషించింది.
 
బలహీన అభ్యర్థులు..
గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థుల్లో అత్యధికులు మోదీ ప్రభంజనం వల్ల గెలిచినవారే. ఇప్పటీకీ వారి స్థానాల్లో బీజేపీ మంచి అభ్యర్థులను కనిపెట్టలేకపోయింది. ఎక్కువచోట్ల సిటింగులనే తిరిగి పోటీలో దించింది.
 
కులసమీకరణలు
అభ్యర్థుల బలహీనత ఎలా ఉన్నప్పటికీ యాదవేతర ఓబీసీలు, అగ్రవర్ణాలు, జాతవేతర దళితుల్లో కొంత మంది బీజేపీతో ఉన్నారు. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో తప్ప రాజపుత్రులు, బ్రాహ్మణులు, ఠాకూర్లు, వైశ్యులు, త్యాగీలు తదితరులు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. కటికలు, వాల్మీకులు, కథేరీయాల వంటి జాతవేతర దళితులు బీజేపీని అభిమానిస్తున్నారు.
 
ఇది బీజేపీకి కొంతమేర సహాయపడవచ్చని పీపుల్స్‌ పల్స్‌ చెబుతోంది. మధ్యశ్రేణి రైతు కులాలు, జాతవులు, చమార్లు, ముస్లింలు బీజేపీని బలంగా వ్యతిరేకిస్తున్నారని ఈ సంస్థ తెలిపింది. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం, రైతులపై దాడులువంటి అనేక అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. వెరసి.. సామాజిక సమీకరణలే కీలకపాత్ర పోషిస్తాయని పీపుల్స్‌ పల్స్‌ అభిప్రాయపడుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *