ఊరంతా విషాదం


  • సగానికి పైగా ఇళ్లకు తాళాలు
గద్వాల, మే 11 (ఆంధ్రజ్యోతి): వెల్దుర్తి రోడ్డు ప్రమాదంతో జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులంతా ఇళ్లకు తాళాలు వేసి కర్నూలు ఆస్పత్రికి పరుగులు తీశారు. గ్రామంలోని యువకులు కూడా తమకు తోచిన సాయం చేద్దామని ఘటనా స్థలానికి తరలివె ళ్లారు. శనివారం రామాపురాన్ని సందర్శించిన వారికి సమాచారం చెప్పడానికి గ్రామంలో మనుషులే లేని పరిస్థితి నెలకొంది. దాదాపు సగానికి పైగా గ్రామస్థులు హుటాహుటిన కర్నూలు చేరుకున్నారు. గ్రామ కూడళ్లల్లో కూర్చున వృద్ధులు కంటతడి పెడుతూ, ప్రమాద ఘటనపై చర్చించుకుంటున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రామాపురానికి మీడియా, పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం రావడంతో ఊళ్లో మిగిలి ఉన్న జనం ఇళ్లలోంచి బయటకు వచ్చారు. తమకు తెలిసిన వివరాలు చెప్పారు. ప్రమాదం అప్‌డేట్లు మీడియాను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన 15 మంది మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల బంధువులంతా ఇళ్లకు తాళాలు వేసి పిల్లలతో సహా కర్నూలు వెళ్లిపోయారు. చుట్టుపక్కల గ్రామాల నాయకులు, ఆయా గ్రామాల్లోని బంధువులు కూడా కర్నూలుకు పయనం అయ్యారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *