ఎండలో తిరగొద్దు


  •  ప్రజలకు ఆరోగ్యశాఖ సూచన
  •  అందుబాటులో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు
  •  పిల్లలకు ఉదయం 7నుంచి వ్యాక్సిన్లు
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో వడదెబ్బ బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజాదర్బార్‌ అనంతరం వడదెబ్బ పరిస్థితులపె అధికారులతో సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లకు ఆరోగ్యశాఖ సూచించింది. పట్టణాలు, గ్రామాల్లో సాధికార మిత్రాలు, ఆశా వర్కర్ల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. చంద్రన్న సంచార చికిత్స ద్వారా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది. తీవ్రమై ఎండలో బయటకు వచ్చేటప్పుడు, ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను పట్టణాల్లో, గ్రామాల్లో పంపిణీ చేస్తోంది.
 
జిల్లాల్లో ప్రముఖుల సాయంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయించే బాధ్యత కూడా ఆరోగ్యశాఖ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో చల్లని మంచినీటితో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచింది. చిన్నారులకు ఉచితంగా అందించే వ్యాక్సిన్ల సమయాల్లో కూడా ఆరోగ్యశాఖ మార్పులు చేసింది. సాధారణంగా ఉదయం 9నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య ఈ వ్యాక్సిన్లు వేస్తారు. ప్రస్తుతం ఆ సమయాన్ని ఉదయం 7గంటల నుంచి 11గంటలకు మార్చారు. వడదెబ్బ బాధితుల కోసం బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 5- 10 పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో అత్యవసర మందులను కూడా అందుబాటులో ఉంచారు.
 
వైద్యసేవలకు సిద్ధంగా ఉండండి: పూనం
రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సూచించారు. వడదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చిన బాధితులకు వెంటనే వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో పలు జిల్లాల వైద్యాధికారులు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. కార్యాలయాలు, మార్కెట్‌, బస్టా్‌పలు, రైల్వేస్టేషన్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బకు గురై ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన 400మందికి మెరుగైన వైద్యసేవలు అందించామన్నారు.
వడదెబ్బ లక్షణాలు
ఎక్కువగా చెమటలు పట్టడం, బాగా దాహం వేయడం, ఎక్కువసేపు నీరసంగా ఉండటం, కళ్లు తిరగడం, జ్వరం రావడం, విపరీతమైన తలనొప్పి, వాంతులు, విరోచనాలు
 
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా ఉండాలి. ఎండలోకి రావాల్సి వస్తే తెల్లని దుస్తులు ధరించాలి. గొడుగును ఉపయోగించాలి. కాటన్‌ దుస్తులు ధరించాలి. మంచినీళ్లతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వెంట తెచ్చుకుంటే మంచిది. ఎక్కువ అలసటగా ఉంటే వెంటనే నీడలోకి వెళ్లాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఉప్పు, పంచదార కలిపిన చల్లటి నీటిని తాగాలి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *