ఎంసెట్‌కు 93.86% హాజరు


  •  కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు
  •  ఆలస్యం కావడంతో అదనపు సమయం
  •  విజయవాడలో సెల్‌ఫోన్‌తో వచ్చిన అభ్యర్థి
  •  మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదు
అమరావతి, జేఎన్‌టీయూకే, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌-అగ్రికల్చర్‌-మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఎంసెట్‌-2019) శనివారం ప్రారంభమైంది. రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారితం)లో పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్‌ఈ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.విజయరాజు జేఎన్టీయూకే సెనెట్‌ హాల్‌లో పరీక్షల సెట్‌ కోడ్‌లను విడుదల చేశారు. తొలిరోజు ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షకు 93.86 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 53,702 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 50,406 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకూ జరిగిన మొదటి సెషన్‌లో 93.67 శాతం(26,335 మందికి గాను 24,669 మంది), మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకూ జరిగిన రెండో సెషన్‌లో 94.04 శాతం(27,367 మందికి గాను 25,737 మంది) పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లోనూ ఈ పరీక్షలు జరిగాయి. తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎంసెట్‌ కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. మే రెండో వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని జేఎన్టీయూకే వీసీ రామలింగరాజు చెప్పారు.
 
పరీక్షలు ఆలస్యం
  • యూపీఎస్‌ ట్రిప్‌ కావడంతో రాజాంలోని జీఎంఆర్‌ఐటీ సెంటర్‌లో 30 నిమిషాలు ఆలస్యంగా, విశాఖపట్నంలోని వీఐటీఏఎం సెంటర్‌లో 17 నిమిషాల ఆలస్యంగా పరీక్ష మొదలైంది. అయితే అభ్యర్థులు నష్టపోకుండా ఆ మేరకు అదనపు సమయం కేటాయించారు.
  • విజయవాడలోని వీ.ఆర్‌.సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ సెంటర్‌లో ఓ అభ్యర్థి పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ తీసుకుని వచ్చి ఓపెన్‌ చేసి చూస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు. సదరు విద్యార్థి సిస్టమ్‌ను వారు ఆపేసి మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేశారు.
  • ‘నిమిషం ఆలస్యమైనా..’ నిబంధన వల్ల ఇద్దరు విద్యార్థులు కాకినాడలో పరీక్షలు రాయలేకపోయారు. కాకినాడ దుమ్ములపేటకు చెందిన అలేఖ్య, రామచంద్రపురానికి చెందిన గణేష్‌ పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా రావడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *