ఎన్నికల్లో రెవెన్యూ శాఖ కృషి అమోఘం


విజయవాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో రెవెన్యూ శాఖ సిబ్బంది కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలో లెనిన్‌సెంటర్లోని రెవెన్యూ భవన్‌లో శనివారం నిర్వహించిన అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్నికల సమయంలో కొన్ని లక్షల ఓట్ల చేర్పులు, మార్పులు చేయడంలో రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు విశేష కృషి చేశారన్నారు. దాదాపు 3 లక్షల ఫాం 7 (తొలగింపులు) క్లయిమ్స్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కేవలం 7 రోజుల్లో విచారణ పూర్తిచేసిన ఘనత రెవెన్యూ శాఖదే అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు దొంగ క్లయిమ్స్‌ పెట్టిన వారిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఒత్తిడిని తట్టుకుని మండలాల్లో, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటర్లను చైతన్య పరచి రాష్ట్ర చరిత్రలోనే 80శాతం పైన ఓటింగ్‌ శాతం నమోదు చేయించి విజయవంతంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన రెవెన్యూ అధికారులు ఉద్యోగులకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే ఈనెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపును కూడా విజయవంతంగా నిర్వహించాలని ఉద్యోగులను కోరారు. ఎన్నికల నిమిత్తం తమ స్వంత జిల్లాల నుంచి బదిలీ అయిన తాహసీల్దార్లను, ఎన్నికల ముందు తాహసీల్దార్లుగా పదోన్నతి కల్పించి ఇతర జిల్లాలకు కేటాయించిన తాహసీల్దార్లను గతంలో పాటించిన విధంగానే ఎన్నికల కమిషన్‌ తిరిగి వారి స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *