ఎన్నికల కోడ్‌… రిలాక్స్‌ మూడ్‌


  • మౌలిక వసతుల కల్పనకు అధికారులు దూరం
  • సమస్యలపై ప్రశ్నిస్తున్న మేయర్‌తో కోడ్‌ ఉందంటున్న అధికారులు
  • న్యూ రాజరాజేశ్వరిపేటలో నీటి ఎద్దడిని పరిష్కరించాలని ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ప్రజలు
కోడ్‌..కోడ్‌.. కోడ్‌.. ఇలా ప్రతి పనికి కోడ్‌ ఉందండి… కాస్తా ఆగండి అన్న సమాధానం కార్పొరేషన్‌ అధికారుల నుంచి వినిపిస్తోంది. నగరంలో మౌలిక సదుపాయాలకు కల్పనకూ కోడ్‌ అంటూ తప్పించుకుంటూ ప్రజలను సమస్యల వలయంలోకి నెట్టేస్తున్నారు. ఓవైపు కృష్ణా నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతుండడంతో నగరంలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. దాహార్తితో అలమటిస్తున్న న్యూ రాజరాజేశ్వరిపేట హెచ్‌బీ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణ పనులకు కోడ్‌ అడ్డంకి కాదని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉన్నతాధికారులే చెబుతున్నా ఫైళ్లు కదపడానికి కార్పొరేషన్‌ అధికారులు జంకుతున్నారు.
 
ఆంధ్రజ్యోతి విజయవాడ: కార్పొరేషన్‌ అధికారులకు ఎన్నికల మత్తు ఇంకా వదలలేదు. కోడ్‌ మాటున రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్లిన అధికారులు పనుల ఊసెత్తితే అంత ఎత్తున లేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు ససేమిరా అంటున్నారు. కార్పొరేషన్‌ పాలననూ పక్కన పడేసి విహార యాత్రల్లో తేలియాడుతున్నారు. సమస్యలపై ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేస్తున్నా.. స్పందించకపోగా ‘‘ఎన్నికల కోడ్‌.. సార్‌ మేం మీతో చర్చలు జరపకూడదు. ఉంటాం.’’ అంటూ ఫోన్లు పెట్టేస్తున్నారు. ఇలా ఎన్నికల కోడ్‌ పేరిట విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులపై ఎన్నికల కమిషన్‌ ఎలా స్పందిస్తుందో తెలీదుకానీ.. నగరవాసులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌బీ కాలనీలో నీళ్ల సమస్య తట్టుకోలేని స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. విషయం పెద్దది కావడంతో స్పందించిన కింది స్థాయి అధికారులు మరింత ఎక్కువ సేపు నీళ్లు వదులుతామని చెప్పి సర్దుకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పారిశుద్ధ్య నిర్వహణ మొదలు నగర పరిపాలనంతా అస్తవ్యస్తం కాక తప్పదు.
 
మరో రెండు నెలల్లో కాల పరిమితి ముగియబోతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల కోడ్‌కు ముందే ప్రారంభించిన పనులను తమ హయాంలో పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కేటాయించిన బడ్జెట్‌ మురిగిపోకుండా అధికారులతో చర్చించి పనులు ప్రారంభించాలని కోరు తున్నా అధికారులు స్పందించకపోగా అడిగిన వాళ్లకూ, అడగని వాళ్లకూ ఎన్నికల కోడ్‌ అంటూ భయాందోళనలు కలిగిస్తున్నారు. ఎందుకు, ఎపుడు స్పందిస్తుందో తెలీని ఎన్నికల కమిషన్‌తో ఎందుకు? అనుకుంటున్న ప్రజాప్రతినిధులెవరూ అధికారుల జోలికి వెళ్లడం లేదు. దీంతో అరకొర ఫోన్లకు కూడా వీఎంసీ అధికారులెవరూ స్పందించడం మానేశారు. ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం 5.9 క్యూసెక్కులకు పడిపోయింది. మే లో 2 టీఎంసీలను బ్యారేజికి వదులుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో వీఎంసీ నీటి రిజర్వాయర్లు, సరఫరా తదితరాలపై చర్చించాలని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లతో మాట్లాడాలని మేయర్‌ కబురు చేయగా ఎన్నికల కోడ్‌ ఉందని, కమిషనర్‌ కలవద్దన్నారని ఈఈలు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా న్యూ ఆర్‌ఆర్‌ పేటలోని జి+3 అపార్ట్‌మెంట్ల వద్ద రెండ్రోజుల క్రితం నీళ్లు అందక నిరసనకు దిగారు. వేసవిలో నీటి వాడకం ఎక్కువగా ఉండే నేపథ్యంలో నిర్ణీత సమయం వరకు నీటి సరఫరా చేయాలని స్థానికులు ఆందోళనకు దిగగా.. బాధితులకు మద్దతుగా సీపీఎం నాయకులు కూడా స్వరం కలిపారు. స్పందించిన కార్పొరేషన్‌ వాటర్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌ రెడ్డి సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చాకే సమస్య సద్దుమణిగింది. కాగా ఇప్పటికే రోడ్లు, డ్రైన్లు, కాల్వల్లో పూడికతీత తదితర సమస్యలతో 59 డివిజన్లలో రోజుకో సమస్య ఉత్పన్నమవుతున్నా అధికారుల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం.
 
ఏటా రూ.2 కోట్ల నష్టానికీ ఎన్నికల కోడే!
నగరానికి గుండె వంటి గవర్నరేపేటలోని కార్పొరేషన్‌కు చెందిన 26 వేల అడుగులకు పైగా ఉన్న స్థలంలో ఆంధ్రా హాస్పిటల్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఆ స్థలంలో అడుగుకు రూ.12.20 పైసల చొప్పున చెల్లిస్తోన్న లీజు మొత్తంపై చాన్నాళ్లుగా పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సదరు నిర్వాహకులు వీఎంసీకి రావాల్సిన సొమ్మును చెల్లించాల్సిందేనని మేయర్‌ కోనేరు శ్రీధర్‌ కూడా పట్టుబడుతూ వచ్చారు. అదే విషయంపై ఎస్టేట్‌ ఆఫీసర్‌ కృష్ణమూర్తితో చర్చించాలని ఫోన్‌ చేయగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నంత కాలం కమిషనర్‌ కలవద్దన్నారన్న సమాధానమే ఎదురైంది. దీంతో మేయర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘వీఎంసీ ఉద్యోగులంతా సెలవు పెట్టి ఎన్నికల కోడ్‌ తర్వాత వస్తే కనీసం నగరపాలకసంస్థకు ఆర్థిక భారమైనా తగ్గుతుందని’’ వాపోయారు. ప్రజల కోసం పనులు చేస్తున్న అధికారులే ఇలా కోడ్‌ పేరుతో తప్పించుకుంటే ఇక ప్రజలకు ఎవరు సమాధానకర్తలుగా ఉంటారని ఆయన ప్రశ్నించారు.
 

కన్నబాబుకు వినతి
వీఎంసీ అధికారుల తీరుపై విసుగెత్తిన మేయర్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ కన్నబాబును సోమవారం కలిసి పరిస్థితిని వివరించారు. పరిపాలనా పరమైన పనులకు, ఎన్నికల కోడ్‌కు సంబంధంలేదని, ఎవరైనా అధికారులు కచ్చితంగా స్పందించి, పరిష్కారం చూపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఉన్నతాధికారులతో చర్చలు జరపడానికి కూడా మేయర్‌గా ఆయనకు అవకాశం ఉందని వివరించారు. వీఎంసీలో అధికారుల తీరుపై స్పందిస్తూ ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి, ఫిర్యాదు చేయాలని కన్నబాబు సూచించారని మేయర్‌ తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *