ఏపీనే ఆదర్శం!


  • ‘ఉపాధి’ వేతనం ఆలస్యమైతే పరిహారం
  • మార్గదర్శకాలు రూపొందించిన కేంద్రం
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించే విషయంలో మన రాష్ట్రంలో గత పదేళ్లుగా అమలవుతున్న విధానాన్నే ఇప్పుడు కేంద్రం అనుసరించనుంది. ఈమేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర మార్గదర్శకాలను రూపొందించింది. కూలీలకు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెట్టేందుకు వీల్లేదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో సూచించింది. పనిచేసిన 15 రోజుల్లోగా కూలీల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాలన్న నిబంధనలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కేంద్రం ఈమేరకు చర్యలు తీసుకుంది.
 
ఉపాధి హామీ చట్టం ప్రకారం ఈ పథకంలో పనిచేసిన కూలీలకు 15 రోజుల్లోపు వేతనాలు అందించాలి. 15 రోజుల తర్వాత చెల్లిస్తే….ఆలస్యపు చెల్లింపులకుగాను పరిహారం అందించాలి. 15 రోజుల తర్వాత చెల్లించే వేతన మొత్తానికి రోజుకు 0.05 శాతం చొప్పున పరిహారాన్ని వేతనాలతో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఆలస్యపు చెల్లింపులకు కారణమైన సిబ్బంది నుంచి గానీ, ఏజెన్సీల నుంచి గాని పరిహారం వసూలు చేసి కూలీలకు చెల్లించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందంటూ కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆలస్యంగా వేతనాల చెల్లింపులకు పరిహారం ఇచ్చే విధానం గత పదేళ్ల నుంచి మన రాష్ట్రంలో అమలవుతోంది. దీని కోసం ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. జాప్యానికి కారణమైన సిబ్బంది జీతాల నుంచి పరిహారాన్ని మినహాయించి కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఆటోమేటిక్‌ విధానం అమలవుతోంది. మన రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించిందని అధికారులు అంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *