ఏపీలో ఎన్నికల్లో వెలుగుచూసిన సరికొత్త కోణం!


ఏపీలో పోలింగ్‌కి ముందే కాదు- పోలింగ్‌ తర్వాత కూడా చాలా విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా పోలింగ్‌కి ముందు ఓటుకి నోటు తీసుకునేవారు ఉంటారు. కానీ ఇప్పుడు పోలింగ్‌ తర్వాత కూడా నోటు అడిగేవారు తయారయ్యారు. అదేమిటని ప్రశ్నిస్తే చిత్రమైన సమాధానం చెబుతున్నారు. ఆ సంగతి ఏంటో తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
     ఏపీ ఎన్నికల్లో విచిత్రమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. గతంలో.. పోలింగ్‌కి ముందు ఓటుకి నోటు పంపకాలు జరిగేవి. అలా నోటు తీసుకున్నవారు కామ్‌గా ఓటేసి వచ్చేవారు! ఇప్పుడు రోజులు మారాయి. పోలింగ్‌ తర్వాత కూడా నోట్లు ఇమ్మని అడిగే పరిస్థితి దాపురించింది.
 
     ఎన్నికలు అనగానే డబ్బులతో పని అన్న భావన ఎప్పుడో స్థిరపడిపోయింది. రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. ఎన్నికల సమయంలో డబ్బులు వెదజల్లాల్సిందే. మందబలంతోపాటు మందుబలం, ఆర్థిక హంగామా లేకపోతే ఎన్నికల రంగంలో మనుగడ కష్టమేనని 2019 ఎన్నికలు నిరూపించాయి. తెలుగుదేశం ప్రభుత్వం గత అయిదేళ్లలో ఏపీలో వేలకోట్ల రూపాయలతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నికలకు ముందు సుమారు 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు కిస్తీల్లో ఒక్కొక్కరికీ పదివేల రూపాయలు చొప్పున పంపిణీ చేసింది. ఈ మొత్తం విలువ 9 వేల 800 కోట్ల రూపాయలు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు రెండు విడతల్లో 4 వేల రూపాయలు బ్యాంకుల్లో వేసింది. పెన్షన్ల పెంపును అమలుచేసి ఒక్కొక్కరికి నెలకు 2 వేల రూపాయలు అందజేసింది. పల్లెలతో సహా ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్లు వేయించింది. మరోవైపు పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలను వేగవంతం చేసింది. చారిత్రకమైన ఆ నిర్మాణాలను తిలకించడానికి ప్రభుత్వ ఖర్చులతో లక్షలాది మందికి అవకాశం కల్పించింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు ప్రగతి ప్రస్థానాలలో సమతౌల్యం పాటించింది.
 
     ఇంత జరిగినప్పటికీ ఎన్నికల సమయం వచ్చేసరికి అందరూ డబ్బుల కోసం ఎదురుచూశారు. ఓటుకు 1500 రూపాయలు ఇచ్చినా సంతృప్తి చెందకుండా “2 వేలు ఇస్తామన్నారు కదా?” అని ఆయా పార్టీల నేతలను కొంతమంది ఓటర్లు ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు వెయ్యి రూపాయలు వంతున ఇవ్వబోతే స్థానికులు అలిగి ఆ డబ్బులు తీసుకోలేదు. “ప్రభుత్వం తరఫున మేము డ్వాక్రా మహిళలకు 10 వేల రూపాయలిచ్చాం.. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కొక్కరికి 4 వేల రూపాయలు అకౌంట్లలో వేశాం.. పెన్షన్లు పెంచాం కదా?” అని కొంతమంది అధికారపార్టీ నేతలు చెప్తే ప్రజల నుంచి చిత్రమైన సమాధానం వచ్చిందట. “అవన్నీ ప్రభుత్వం తరఫున చేశారు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. కాబట్టి ఓటుకు డబ్బులు ఇవ్వాల్సిందే” అంటూ సంక్షేమ పథకాల లబ్ధిపొందినవారిలో కొందరు ఖరాకండిగా చెప్పారట. దీంతో అభ్యర్థులు షాక్ అయిన మాట వాస్తవం. డబ్బులివ్వందే ఓటింగ్‌కు రామని మరికొంతమంది మొరాయించిన సంగతి కూడా విదితమే!
 
     ఈ పరిస్థితుల్లో అన్ని పక్షాల నేతలు ఓటుకి నోటు చెల్లించక తప్పలేదు. పోలింగ్‌కు ముందురోజు వరకు కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంచగా, పోలింగ్ రోజున కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు నోట్లిచ్చారు. ఈ డబ్బుల పంపిణీ సమయంలో ఇళ్లల్లో లేనివారిలో కొంతమంది పోలింగ్‌ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులను కలిశారట. “మేము మీకే ఓటేశాం. డబ్బులు ఇవ్వాలి” అని అడిగారట. ఈ పరిణామంతో ఆయా నేతల నోట మాట రాలేదట. గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఏపీలో చాలా ప్రాంతాల్లో పోలింగ్ ముగిశాక కూడా ఓటర్లు ఏ పార్టీకి ఓట్లేశారో తెలుసుకుని కొంతమంది డబ్బులు పంపిణీ చేయడం గమనార్హం.
 
   “డబ్బులు పంపిణీ చేసే సమయంలో మేము లేము. ఆ తర్వాత వచ్చాం. మా ఓటు మీకే వేశాం” అని చెప్పి డబ్బులు అడిగే కొత్త సంస్కృతి ఈ ఎన్నికల్లోనే మొదలైందని కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఆశ్చర్యంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ దగ్గరికి వచ్చిన వారు ఏ పార్టీకి ఓటేశారో తెలుసుకునేందుకు స్థానిక నేతలను సంప్రదిస్తున్నారట. వారు ధ్రువీకరించిన తర్వాతే సదరు వ్యక్తులకు అభ్యర్థులు డబ్బులిస్తున్నారట. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్‌కు సిద్ధమైన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఓటును అమ్ముకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. క్యూలైన్లలో నిలబడి ఉన్నవారికి కూడా డబ్బులిచ్చిన విషయాన్ని కొన్ని పార్టీల అభ్యర్థులు గుర్తుచేసుకుంటున్నారు. ఇదండీ ఏపీలో ఎన్నికల్లో వెలుగుచూసిన సరికొత్త కోణం!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *