ఏపీలో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటర్లు ఎలాంటి షాకిచ్చారు?


సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా.. పోలింగ్‌కు ముందు చేతుల్లో విటమిన్లు పడందే ఎవరు బయటికి కదలడంలేదు. డ్వాక్రా మహిళలకు పసుపు- కుంకుమ కింద 10 వేల రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద 4 వేల రూపాయలు, రుణమాఫీ నాలుగో విడత నిధులు, ప్రతినెలా ఇచ్చే పెన్షన్లు 2 వేలు- ఇలా ఎన్ని చేసినా సరే.. పోలింగ్‌కు ముందు డబ్బు ఇవ్వటానికెళ్లిన రాజకీయ పార్టీ నేతలకు ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయి. కొంతమంది ఎమ్మెల్యేలు పోలింగ్ తర్వాత ఈ అనుభవాలను వివరిస్తూ ఆశ్చర్యపోతున్నారు. అవి ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనంలో తెలుసుకోండి.
 
    ఆర్థిక, అంగబలాలు పుష్కలంగా ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నిత్యం ప్రజలతో ఉండి.. వారికి అవసరమైన అన్నీ పనులను చేస్తున్నప్పటికీ, పోలింగ్ సమయం వచ్చేసరికి ప్రజలు తమకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఓటింగ్‌కు రాని గ్రామాలు నేటికీ అనేకం ఉన్నాయి. పోలింగ్‌కు అయిదు రోజుల ముందునుంచే ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఎత్తులు- పైఎత్తులు వేసుకొని డబ్బులు పంపిణీ చేసుకున్నారు. ఈసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డబ్బు ముందుగానే చేరింది. తెలుగుదేశం నేతలకు మాత్రం చివరి నిముషం వరకు డబ్బు అందలేదు. రెండు రోజులు ముందుగానే డబ్బు అందినప్పటికీ క్షేత్రస్థాయి వరకు కొన్ని నియోజకవర్గాల్లో ఆ డబ్బు చేరలేదని అంటున్నారు.
 
    అయితే.. ఓటర్లుకు డబ్బు పంపిణీ చేసే విషయంలో కొందరు నేతలకు చిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. కృష్ణాజిల్లాలో ఓటుకి 500 రూపాయలు పంపిణీ చేసిన ఓ పార్టీకి చెందిన అసెంబ్లీ అభ్యర్థికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ ఎన్నికల్లో 2 వేలు ఇస్తారని అనుకున్నామనీ, కాని 500లు ఇవ్వటం ఏమిటనీ సదరు నేతని ప్రజలు నిలదీశారట. మరికొన్ని గ్రామాల్లో ఓటుకి 500 రూపాయలు తీసుకోకుండా అలిగిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఈ నేపథ్యంలో ప్రత్యర్థివర్గం ఆ విషయం తెలుసుకొని 800 రూపాయలు పంపిణీ చేసిందట. ఈ వార్త తెలిసిన తర్వాత మొదట 500 రూపాయలు ఇచ్చిన అభ్యర్థి తిరిగి 300లు అదనంగా రెండో రౌండ్‌లో ఇచ్చారట.
 
   గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఓటుకి 1500 రూపాయలు పంపిణీ చేశారట. కొన్ని గ్రామాల్లో మహిళల వద్దకి వెళితే మూడు 500 నోట్లు ఇవ్వటం కష్టం కదా.. 2 వేల రూపాయల నోటు ఇస్తే సరిపోతుంది కదా అని ముక్తాయించారట! విజయవాడ నగర పరిధిలోని ఓ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి అసలు డబ్బు పంపిణీ చేయలేదు. ఇది తెలుసుకున్న ప్రత్యర్థి ఓటుకు 500ల రూపాయల చొప్పున కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేశారు. డబ్బు తీసుకున్నవారు మోసంచేయరని చెబుతారు. అందువల్లే వారు డబ్బు పంపిణీ చేయని అభ్యర్థిపై అభిమానం ఉన్నప్పటికీ డబ్బు తీసుకున్నామనే విశ్వాసంతో అవతలిపక్షం నేతకే ఓటు వేశారట.
 
    అపార్ట్‌మెంట్‌లు, ధనవంతులు ఉండే ప్రాంతాలు మినహా.. మధ్య, అల్పాదాయ వర్గాలు ఉండే అనేక ప్రాంతాల్లో ఈసారి అధికంగా డబ్బులు ఇచ్చినవారికే ఓటు పడిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో డబ్బు బాగా పంపిణీ చేస్తారని అనేకమంది ఓటర్లు ముందే ఓ అంచనాకి వచ్చారు. ఓటుకు 2 వేల రూపాయలు కనీసంగా చేతికి వస్తుందని ఎక్కువమంది భావించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకి 2 వేల రూపాయలు వంతున పంపిణీ జరిగినట్టు సమాచారం. మరికొన్ని నియోజకవర్గాల్లో తక్కువ డబ్బు పంపిణీ చేయడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురయ్యారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టుగా వినికిడి. తక్కువ పంపిణీ జరిగిన నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఉన్న నేతలను జనం నిలదీశారట. పొరుగు నియోజకవర్గాల్లో 2 వేల రూపాయలు ఇస్తున్నారు కదా అని ప్రశ్నించారని బరిలో నిలిచిన అభ్యర్థులే చెబుతున్నారు.
 
   ఎన్నికల రంగం ఇంతలా డబ్బుతో ముడిపడటం పట్ల ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాము సంపాదిస్తుంటే అవినీతికి పాల్పడుతున్నామని పదేపదే విమర్శించే జనం.. ఎన్నికల సమయంలో 2 వేలు ఇవ్వందే ఓటు వేసేదిలేదని చెప్పడమేంటని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉదాహరణకి ఏదైనా ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే అందులో 70 శాతం మందికి డబ్బు పంచాల్సి వస్తోంది. అంటే సుమారుగా వారి సంఖ్య లక్షా 25 వేల వరకూ ఉంటుంది. అంతమందికి ఒక్కొక్కరికి 2 వేలు ఇవ్వాలంటే దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయలు కావాలని అభ్యర్థులు విశ్లేషిస్తున్నారు. ఇవికాకుండా కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయలు మిగతా ఖర్చులుంటాయని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే, ఒక్కో నియోజకవర్గానికి దాదాపుగా 30 నుంచి 40 కోట్ల రూపాయలు కనీసంగా ఖర్చవుతుందన్నమాట. అందుకే కావచ్చు ఈ ఎన్నికల్లో పోటీచేసిన అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు లోలోపల గుబులుగా ఉన్నారు. ఫలితం తారుమారు అయితే ఎలా అన్నదే వారి అంతర్మథనానికి కారణం!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *