ఏపీ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా వాళ్లెందుకు పోటీ చేసినట్లు?


ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఈసారి ఎవరి మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది అని ఎవరినైనా అడిగితే ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌తోపాటు జనసేన మధ్య మాత్రమే అని సమాధానం చెప్తారు. మరి జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ప్రస్తావన ఎందుకు రావడంలేదు? ఆ రెండు పార్టీలు ఎందుకు తీసికట్టుగా మారాయి? గెలవరని తెలిసినా ఆ రెండు పార్టీల పక్షాన ఎవరు ఎన్నికల బరిలో నిలిచారు? ఈ ప్రశ్నలకు విశాఖ ప్రజానీకం ఏ సమాధానామిస్తోందో ఈ కథనంలో తెలుసుకోండి
 
   విశాఖ తీరంలో ఈసారి చిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొన్నది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ పార్టీల చర్చే దాదాపుగా కనుమరుగయ్యింది. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతాపార్టీ. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకోవడం ద్వారా విశాఖజిల్లాలో ఒక అసెంబ్లీ స్థానంతోపాటు విశాఖ పార్లమెంట్‌ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పరిస్థితి “ఉప్పు-నిప్పు”లా ఉంది. ఈ తరుణంలో మొన్నటి ఎన్నికల్లో ఏపీ మొత్తాన్ని పరిశీలిస్తే స్వల్ప స్థానాల్లో మాత్రమే బీజేపీ నేతల్లో చురుకుదనం కనిపించింది. మిగతా చోట్ల సోసోగా బండి నడిపించారు. పదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన కాంగ్రెస్‌పార్టీ అడ్రస్‌ అయితే పూర్తిగా గల్లంతయ్యిందనే చెప్పాలి.
 
   అయినప్పటికీ విశాఖ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. వీరిలో చాలామంది పేర్లు కనీసం ఆ పార్టీ శ్రేణులకు కూడా పెద్దగా తెలియకపోవడం ఆశ్చర్యకరం. బీజేపీ విషయానికి వస్తే.. ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పాడేరులో లోకుల గాంధీ పేర్లు మాత్రమే సుపరిచితం. మిగతా అభ్యర్థులంతా ప్రజాశ్రేణులకి కొత్త ముఖాలే!
 
    విశాఖ జిల్లాలో పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థుల విషయం కూడా ఇంతే! విశాఖ పార్లమెంట్‌ స్థానం అభ్యర్థి పేడాడ రమణకుమారి పేరు మాత్రమే లోకల్‌గా కొంత పాపులర్‌. మిగతా అభ్యర్థుల బయోడేటాల సంగతి ఎవరికీ తెలియదు. గెలిచే అవకాశం ఏమాత్రం లేదని తెలిసి కూడా వీరంతా ఎందుకు బరిలో నిలిచారన్న ప్రశ్నకి చిత్రమైన సమాధానం వినిపిస్తోంది.
 
 
  ఈ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్‌ సారథ్యంలోని కూటమి లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి రావడం గ్యారంటీ! ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఆ రెండు పార్టీల తరఫున ఏపీలో పలువురు అభ్యర్థులు పోటీకి దిగారు. రాష్ట్ర పరిధిలో గెలవలేకపోయినా… వచ్చే రోజుల్లో ఏదో ఒక నామినేటెడ్‌ పదవో.. వ్యాపారపరమైన ఫలమో దక్కుతాయిని వారంతా ఆశిస్తున్నారట. మరికొందరి వాదన వేరుగా ఉంది. “ఇన్నాళ్లూ పార్టీలో ఉన్నా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడితే.. కనీసం పార్టీ ఫండ్‌ అయినా ప్రతిఫలంగా లభిస్తుందన్న ఆశతో పోటీకి దిగాము” అని వారు కుండ బద్దలు కొడుతున్నారు! ఎంపీ అభ్యర్థుల నుంచి అసెంబ్లీ అభ్యర్థుల వరకూ అందరి నోటా ఇదే మాట! ఎలాగూ గెలిచే అవకాశం లేదు కాబట్టి.. పైసా ఖర్చు పెట్టనక్కరలేదు. ఆ రకంగా పార్టీ ఫండ్‌ అయినా తృణమోపణమో మిగులుతుందన్న ఉద్దేశంతోనే పోటీచేశామని అధికులు చెబుతున్నారు. పైసలు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో కనీసం తమ తరఫున ప్రచారానికి ఏజెంట్లను కూడా కొందరు అభ్యర్థులు పెట్టుకోలేదట!
 
  విశాఖ జిల్లాలో కాంగ్రెస్‌తో పోలిస్తే.. బీజేపీ అభ్యర్థుల పరిస్థితి కొంత బెటర్‌గానే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఖర్చుల కోసం వారికి బాగానే డబ్బులు ముట్టాయట. విశాఖ ఎంపీ ఆభ్యర్ధికి పార్టీ పక్షాన భారీగానే సొమ్ములు చేరాయని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పక్షాన పురంధేశ్వరి రంగంలో ఉన్నారు. ఆమె కూడా గెలుపుపై ధీమాతో పోటీకి దిగలేదట. వచ్చే రోజుల్లో పరిస్థితులు అనుకూలించి తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి లభిస్తుందన్న అంచనాతోనే బరిలోకి దిగారట.
 
   విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకే కాస్తోకూస్తో చేతి చమురు వదిలి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడంతో అమిత్ షా వచ్చినప్పుడు బాగానే ఖర్చయి ఉంటుందని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. మిగతా అభ్యర్థులు మాత్రం పైసల విషయంలో పీనాసితనం పాటించారట. చూద్దాం వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *