ఏపీ ఎన్నికల ఫలితాలపై ఓ మాజీ అధికారి ఎలాంటి లెక్క చెప్పారు?


ఆయనో మాజీ పోలీస్ ఉన్నతాధికారి. ఖాకీ నుంచి ఖద్దర్‌కు మారారు. సాక్షాత్తు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీచేశారు. పోలీస్ అధికారిగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సహా ఇతర శాఖల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో ఏ విషయాన్నయినా సమర్థవంతంగా విశ్లేషించగలరు. ఆయన సొంత ఖర్చుతో చేయించిన ఓ సర్వే ఇప్పుడు అటు టీడీపీలో, ఇటు సీఎంవోలో, చివరకు రాజధాని మీడియాలో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ సంగతులేంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
   పోలింగ్ తర్వాత ఏపీలో రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాజకీయ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నేతలు సొంత సర్వేల వైపు మొగ్గుచూపారు. పోలింగ్‌కు ముందు ప్రీపోల్ సర్వే, పోలింగ్ రోజు ఎగ్జిట్ పోల్, పోలింగ్ తర్వాత పోస్ట్ పోల్ సర్వేలు చేయించారు. చెలామణిలో ఉన్న సర్వేలకు, తాము చేయించిన సర్వలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా వారు విశ్లేషించుకుంటున్నారు.
 
  తాజాగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన ఓ మాజీ పోలీస్ అధికారి చేయించిన సర్వే ఆ పార్టీ వర్గాలతోపాటు సీఎంవోలో కూడా చర్చనీయాంశమైంది. ఈ సర్వే చేసిన సంస్థ గతంలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించిందట. ఆ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతారనే అంశాన్ని స్పష్టంగా చెప్పిందట. రెండు మూడు నియోజకవర్గాలు మినహా, తెలంగాణవ్యాప్తంగా ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో కచ్చితమైన ఫలితాలు వచ్చాయట. దీంతో అదే సంస్థతో ప్రస్తుతం ఈ పోలీస్ అధికారి సర్వే నిర్వహించారు. ప్రతి ఎన్నికల్లోనూ తనకున్న పరిజ్ఞానంతో చేసే విశ్లేషణకి తోడు ఆ సంస్థ ద్వారా కూడా సర్వే చేయించి, ఆ రెండింటినీ కలిపి భేరీజు వేసుకుంటారట ఆయన. అనంతరం ఓ అంచనాకి వచ్చే ఈ మాజీ పోలీసు అధికారి భారీగా బెట్టింగ్‌లు కూడా కాశారు. డబ్బులూ గడించారు. అది వేరే విషయం.
 
   ఏపీ పోలింగ్‌ సరళిపై తాజాగా ఆయన చేయించిన సర్వే ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతంతో సహా వివరాలున్న ఆ సర్వే నివేదిక సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా రాయలసీమతోపాటు కోస్తాలో బాగా పుంజుకుని తిరిగి అధికారంలోకి రాబోతుందనేది ఆ సర్వే సారాంశం. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు వచ్చే ఓట్ల శాతంతోపాటు ఇరువురికి మధ్య ఉన్న తేడాను కూడా సదరు మాజీ పోలీసు అధికారి పూర్తిస్థాయిలో వివరించారు.
 
     కొన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు రాబట్టుకోవడం ఖాయమని ఆయన చెబుతుండగా, ఆ విషయాన్ని ఆ జిల్లా నేతలు సైతం నమ్మలేకపోతున్నారు. కానీ ఇది జరిగి తీరుతుందని ఆ మాజీ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎవరు గెలుస్తారనే అంశంపై ఆయనిచ్చే రీజనింగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. “మనీ మేనేజ్‌మెంట్‌ విషయంలో టీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో విఫలమైంది. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండదా?” అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, మనీ మాత్రమే ప్రభావం చూపే పక్షంలో అధికారంలో ఉన్న ఏ పాలకపక్షం కూడా ఓడిపోదని ఆయన వ్యాఖ్యానించారు. కులాలవారీగా ఓటర్లు తమకు వేసిన ఓట్ల గురించి వైసీపీ చేస్తున్న వాదనను ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఈసారి క్యాస్ట్ పోలరైజేషన్ జరిగిందనీ, కానీ మహిళలు మాత్రం టీడీపీవైపే మొగ్గుచూపారనీ చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలుగుదేశానికి కొన్ని జిల్లాల్లో అనూహ్య ఫలితాలు తెచ్చి పెట్టబోతున్నాయని ఆయన విశ్లేషించారు.
 
   తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాలు టీడీపీకి తగ్గినప్పటికీ, రాయలసీమలో మాత్రం ఆ లోటు భర్తీ అవుతుందనీ, కోస్తాలో టీడీపీ స్వీప్ చేయబోతోందనీ ఆయన ఆప్ ద రికార్డ్‌ వ్యాఖ్యానించారు. ఆయన చెబుతున్న లెక్కలు, చేస్తోన్న విశ్లేషణ, ఇస్తున్న రీజనింగ్, తన సర్వే మెథడాలజీ, చేసిన తీరును వివరిస్తుంటే మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యంగా వింటూండిపోయారు. మే 23వ తేదీ మధ్యాహ్నం మళ్లీ సీఎం ఇంటివద్ద కలుద్దామనీ, తాను ఎంపీగా గెలిచి వస్తాననీ ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మీడియా వారిని మరింత ఆశ్చర్యపరిచాయి. ఇదండీ.. మాజీ పోలీసు అధికారి ఏపీ పోలింగ్‌పై చేయించిన తాజా సర్వే రిపోర్ట్‌!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *