ఏ మీట నొక్కినా ఓటు బీజేపీకే!


  • ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ సంచలన ఆరోపణ..
  • గోవాలో గోల్‌మాల్‌పై కేజ్రీవాల్‌ ట్వీట్లు
  • బీజేపీకి ఇచ్చినవి 9.. వచ్చిన ఓట్లు 17!
  • గోవా మాక్‌ పోలింగ్‌లో విస్మయ ఫలితం
  • 3వ దశలోనూ ఈవీఎంలపై ఫిర్యాదులు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: మూడో దశ పోలింగ్‌లోనూ ఈవీఎంలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విపక్షాల అనుమానాలను నిజం చేస్తూ వివిధ రాష్ట్రాల్లో అనేక లోపాలు తలెత్తాయి. గోవాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే పడుతుండడంతో ఈవీఎంను మార్చారు. మొదటి నుంచీ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నేతలు మూడో దశ పోలింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న ఉదంతాలపై ఆగ్రహం వెళ్లగక్కారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్‌లు లెక్కించాలన్న డిమాండ్‌ను మళ్లీ వినిపించడంతో పాటు అందుకు అంగీకరించని ఎన్నికల కమిషన్‌ తీరును తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడమో లేదా ఎవరికి ఓటేసినా బీజేపీకే పడడమో జరుగుతోందని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన ఆరోపణ చేశారు. యూపీలోని సౌఫయీలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
 
పోలింగ్‌ సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడం వల్లే ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారని, ఇదేనా ప్రభుత్వం గొప్పగా చెబుతున్న డిజిటల్‌ ఇండియా? అని ప్రశ్నించారు. దీన్ని నేరపూరిత నిర్లక్ష్యంగా అభివర్ణించారు. రాంపూర్‌ నియోజకవర్గంలో ఈవీఎంలలో తేడాలపై సమాజ్‌వాది ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌ ధృతరాష్ట్రుడిలా నటిస్తోందని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ విమర్శించారు. ఏ బటన్‌ నొక్కినా బీజేపీకే ఓటు పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ స్లిప్‌లను 50 శాతం లెక్కించాల్సిందేనని కాంగ్రెస్‌ నేత సుశీల్‌ కుమార్‌ షిండే డిమాండ్‌ చేశారు.
 
ప్రోగ్రామింగే అలా చేశారా?
గోవాలో ఈవీఎంల వైఫల్యంపై ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వరుస ట్వీట్లు చేశారు. ‘‘గోవాలో చెర్తల సమీపంలో గల కిజక్కే నల్‌పతులోని ఒక పోలింగ్‌ కేంద్రంలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడుతుండడాన్ని గుర్తించి ఈవీఎంను మార్చారు’’ అని పేర్కొన్నారు. అలాగే ఆప్‌ గోవా కన్వీనర్‌ ఎల్విస్‌ గోమ్స్‌ ట్వీట్‌ను కేజ్రీవాల్‌ షేర్‌ చేశారు. ‘‘ఇవి సిగ్గుపడాల్సిన ఎన్నికలు. గోవాలోని 31వ కేంద్రంలో మాక్‌ పోలింగ్‌లో ఆరుగురు అభ్యర్థులకు తొమ్మిది చొప్పున ఓట్లు కేటాయించగా… లెక్కింపులో బీజేపీకి 17, కాంగ్రె్‌సకు 9, ఆప్‌కు 8, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు వచ్చాయి’’ అని గోమ్స్‌ తెలిపారు. ‘‘గోవాలోని లోపభూయిష్టమైన ఈవీఎంలలో ఇతరుల ఓట్లు బీజేపీకి బదిలీ అవుతున్నాయి.
 
ఇది నిజంగా ఈవీఎంల లోపమా? లేక అలా పడేట్లు ప్రోగ్రామింగ్‌ చేశారా? అని కేజ్రీవాల్‌ అనుమానం వ్యక్తం చేశారు. ‘‘గోవాలోనే మరో కేంద్రంలో మాక్‌ పోలింగ్‌లో మొత్తం 8 ఓట్లు పడితే బీజేపీకి 17, ఆప్‌కు 8, కాంగ్రెస్‌ 7 వచ్చాయి. ఇదెలా సాధ్యం? దేశమంతా ఇలాగే ఉంది’’ అని గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రకాంత్‌ కల్వేకర్‌ ప్రశ్నించారు. కాగా, కాంగ్రె్‌సకు ఓటేస్తుంటే బీజేపీకి వెళుతోందంటూ ఓటర్లు ఫిర్యాదు చేయడంతో కేరళలోని తిరువనంతపురంలో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, ఎండల తీవ్రతతో వేడికి ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయని పలుచోట్ల అధికారులు వివరణ ఇవ్వడం గమనార్హం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *