ఐస్‌


ఆంధ్రజ్యోతి విజయవాడ: వేసవిలో వేడికి కళ్లు మండిపోతున్నాయి. కళ్లు పొడిబారటం, మంటలుగా ఉండటం చికాకును తెప్పిస్తాయి. ఇక ద్విచక్ర వాహనాలు నడిపే వారి పరిస్థితి మరీ ఘోరం. ఇలాంటి సమయంలో కళ్లకు సంరక్షణతో పాటు చలువ చేసే కూల్‌ ఐ గ్లాసెస్‌ను ఉపయోగించడం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. యువత ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని నగరంలోకి ప్రవేశించాయి ట్రెండీ కూల్‌ గ్లాసెస్‌. నగరంలోని ఆప్ట్టికల్‌ షోరూమ్‌లలో ఇవి లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే ట్రెండీ కళ్లజోళ్లు లభిస్తుండటంతో వాటి కంటే మన్నికగా ఉండే ఉత్పత్తులనే షోరూమ్‌ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.99 నుంచి మొదలై రూ.9,999, రూ.12వేల వరకు కళ్లజోళ్లు అందుబాటులో ఉన్నాయి. బైకర్లను దృష్టిలో పెట్టుకుని రూ.500-రూ.1,000 మధ్యలో కూలింగ్‌ గ్లాసెస్‌ లభిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారుల కోసం కళ్లను కప్పి ఉంచేలా స్టైలిష్‌ కళ్లజోళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇవి చలువ అద్దాలే కాకుండా యాంటీగ్లేర్‌ ఫీచర్‌ కూడా. అన్‌ బ్రాండెడ్‌ అయితే ఆన్‌లైన్‌ మార్కెట్‌లో రూ.100 నుంచే లభిస్తున్నాయి.
 
ఇక వీధుల్లో లభించేవైతే రూ.99లే. ఇవి అంతగా మన్నికగా ఉండవు. ఇక విద్యార్థులు, యువతను ఆకట్టుకోవటానికి వీలుగా కలర్‌ఫుల్‌ గ్లాసెస్‌తో కూడిన ట్రెండీ సన్‌ గ్లాసెస్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. ఎన్ని రంగుల్లో ఉన్నా కళ్లకు పెట్టుకుంటే మాత్రం సాధారణ కూలింగ్‌ గ్లాస్‌ల మాదిరిగానే కనిపిస్తాయి. రేబాన్‌ సంస్థ రూ.500కే కళ్లజోళ్లను అందుబాటులోకి తెచ్చింది. అంతర్జాతీయ బ్రాండ్లలో ఒకటైన వెర్మాంట్‌ సంస్థ క్లాసిక్‌ శ్రేణిలో సరికొత్త కళ్లజోళ్లను సిద్ధం చేసింది. వీటి ధర 116 డాలర్లు. ఈ కళ్లజోళ్లు సింపుల్‌గా, క్లాసిక్‌గా కనిపిస్తాయి. అలాగే, మార్కెట్‌లోకి ఈసారి ఎక్కువ సంఖ్యలో బ్లూటూత్‌, ఇయర్‌ ఫోన్‌ సదుపాయంతో కూడిన కళ్లజోళ్లు వచ్చాయి. వీటి ధర రూ.11వేల నుంచి రూ.12వేల వరకు ఉంది. వీటిద్వారా పాటలు వినడంతో పాటు బ్లూటూత్‌ను ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుని కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. గత ఏడాది వీటికి లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ఈసారి భారీ సంఖ్యలో అందుబాటులోకి తెచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *