ఒంటరి కన్నయ్య..


  • ప్రముఖులంతా వెంటేనయ్యా!
  • బెగుసరాయ్‌ బరిలో విద్యార్థి నేత.. అయిష్టంగా గోదాలోకి కేంద్ర మంత్రి.. ఓట్లు చీలితే తమకే లాభమంటున్న ఆర్జేడీ
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో బిహార్‌లోని బెగుసరాయ్‌ ఒకటి. నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగడం.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌పై పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది.
 
వామపక్షాలకు బెగుసరాయ్‌ ఒకప్పుడు గట్టి పట్టున్న ప్రాంతం. లెనిన్‌గ్రాడ్‌గానూ దీనికి పేరు. 1967లో యోగేంద్ర శర్మ సీపీఐ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లోనూ సీపీఐ అభ్యర్థికి 11.87ు ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో కన్నయ్యను గెలిపించి పార్టీకి పూర్వవైభవం తేవాలని సీపీఐ భావిస్తోంది. అందుకే పట్టుబట్టి మరీ స్థానికుడైన కన్నయ్యను పోటీలో నిలబెట్టింది. మరోవైపు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ మళ్లీ సత్తా చాటాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను రంగంలో దించిం ది. నవడా సిటింగ్‌ స్థానాన్ని కాదని ఆయనకు బెగుసరాయ్‌ టికెట్‌ ఇచ్చింది. అయితే ఆయన మాత్రం అయిష్టంగానే బరిలో దిగారు. అటు ఆర్జేడీ కూడా గత ఎన్నికల్లో 3.69 లక్షల ఓట్లు దక్కించుకున్న తన్వీర్‌ హసన్‌ను అభ్యర్థిగా ప్రకటించి త్రిముఖ పోరుకు తెరతీసింది.
 
భూమిహార్లే కీలకం
బెగుసరాయ్‌ జిల్లా జనాభా 30 లక్షలు. వీరిలో 4 లక్షలకుపైగా ఎస్సీలు.. 4.50 లక్షల భూమిహార్లు ఉన్నారు. ఇక్కడ భూమిహార్లదే ఆధిపత్యం. ప్రధాన ప్రత్యర్థులైన గిరిరాజ్‌ సింగ్‌, కన్నయ్య కుమార్‌ ఈ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇద్దరి మధ్య ఓట్లు చీలితే తమకు లాభమని ఆర్జేడీ భావిస్తోంది. పైగా తన్వీర్‌ ముస్లిం కావడం, యాదవ్‌ల ఓట్లు తమకే పడతాయని అంచనా వేస్తోంది.
 
కూటమిలో కన్నయ్య చిచ్చు
మహాకూటమి తరఫున తన్వీర్‌ను బరిలో దించాలని ఆర్జేడీ ముందుగా భావించింది. కానీ తమ ఉనికిని కాపాడుకోవాలంటే కన్నయ్యనే సరైన వ్యక్తి అని సీపీఐ నిర్ణయించుకుని పోటీకి సై అంది. దీంతో బిహార్‌ మహాకూటమి నుంచి సీపీఐ బయటకు రావాల్సి వచ్చింది. ఫలితంగా కన్నయ్యకు మహాకూటమి మద్దతు లేకుం డా పోయింది. కాగా, కన్నయ్యను గెలిపించేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటి ఉద్దంఢులు రంగంలోకి దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజాగొంతుకను గెలిపించాలని కోరుతున్నారు.

ప్రముఖుల మద్దతూ ఆయనకే!
షబానా ఆజ్మీ, జావేద్‌ అక్తర్‌, స్వరభాస్కర్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు కన్నయ్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన గెలిస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అటు గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని, నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా స్వయంగా బెగుసరాయ్‌లో ప్రచారం నిర్వహించారు. కన్నయ్యను గెలిపిస్తే లోక్‌సభలో ప్రజల సమస్యలను వినిపిస్తాడని అంటున్నారు. చిన్న చిన్న పార్టీలు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. కాగా, మోదీ ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని గిరిరాజ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యూ) మద్దతు కూడా తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు తన్వీర్‌ హసన్‌ స్థానికంగా అందుబాటులో ఉండటం, ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడంతో తామే గెలుస్తామని ఆర్జేడీ అంచనాలు వేసుకుంటోంది.
 
మొత్తం ఓటర్లు 17.78 లక్షలు
పురుషులు 9.49 లక్షలు
మహిళలు 8.28 లక్షలు

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *