ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు


చెన్నై, మే 10 (ఆంధ్రజ్యోతి): రైల్వే సిబ్బంది మధ్య సమాచార లోపంతో మదురై-విరుదునగర్‌ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌పై రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఎదురె దురుగా వచ్చాయి. చివరి నిమిషంలో ప్రమాదాన్ని పసిగట్టి రైళ్లను నిలిపి వేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. మదురై -సెంగోట్టై ప్యాసింజర్‌ రైలు గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తిరుమంగళం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపటికే ఆ రైలు వెళ్లేందుకు అధికారులు సిగ్నల్‌ ఇచ్చారు. అదే సమయంలో సెంగోట్టై నుంచి మదురై వైపు అదే ట్రాక్‌పై మరో ప్యాసింజర్‌ రైలు వస్తోంది.
 
అది సింగిల్‌ ట్రాక్‌ కావడంతో సెంగోట్టై వెళ్లవలసిన రైలుని తిరుమంగళంలోనే నిలిపివేయాలి. కానీ, సిగ్నల్‌ ఇవ్వడంతో రెండు రైళ్లు ఢీకొనే ప్రమాద స్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గ్రహించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన రెండు రైళ్ల లోకో పైలట్లకు సమాచారం ఇవ్వడంతో… వారు వెంటనే రైళ్లను నిలిపివేశారు. తిరుమంగళం, కల్లిగుడి స్టేషన్‌ మేనేజర్ల మధ్య సమాచార లోపం ఈ పరిస్థితి తలెత్తినట్టు అధికారుల విచారణలో తెలిసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను కల్లిగుడి, తిరుమంగళం స్టేషన్‌ మాస్టర్లు సహా ముగ్గురిని అధికారులు సస్పెండ్‌ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *