ఒక్కొక్కరికి ఒక్కోలా కోడ్‌!


  • కేంద్రం చేతిలో పావుగా ఈసీ.. ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న సీఎస్‌
  • రౌండ్‌ టేబుల్‌లో కంచె ఐలయ్య, జూపూడి ధ్వజం
విజయవాడ(గవర్నర్‌పేట), మే 9: ఎన్నికల నిబంధనావళిలోని అంశాలను కేంద్ర ప్రభుత్వానికి ఒక విధంగా, రాష్ట్ర ప్రభుత్వానికి మరో విధంగా వర్తింపచేయడం రాజ్యాంగ సంక్షోభాన్ని కలిగించడమేనని ప్రముఖ రచయిత, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య స్పష్టం చేశారు. ‘ఎన్నికల నిబంధనావళి-సీఎం, సీఎస్‌, సీఈవోల విధులు, బాధ్యతల సంఘర్షణ’ అనే అంశంపై రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్‌లో గురువారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఐలయ్య మాట్లాడుతూ శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, అధికార వ్యవస్థల విధులు, బాధ్యతలను రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించిందన్నారు. రాజకీయ ఒత్తిడులు, పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు.
 
ఏపీ ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈవో) అధికారాలను బ్లాక్‌ చేసి చీఫ్‌ సెక్రటరీ(సీఎస్‌) అన్నీ తానై వ్యవహరిస్తూ రాష్ట్రంలో సంఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ప్రధానమంత్రి అన్ని సమీక్షలూ చేస్తుంటే అడ్డుకోని ఈసీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నిలువరించాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. సామాజిక విశ్లేషకులు దుర్గం సుబ్బారావు, రాజకీయ విశ్లేషకులు ఎన్‌.నరసింహారావు, కెవీపీఎస్‌ అధ్యక్షుడు మాల్యాద్రి, జర్నలిస్ట్‌ యూనియన్‌ నేత కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *