ఒడిషాను అన్ని విధాలా ఆదుకుంటాం.. : మోదీ


భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో ‘ఫణి’ తుపాను అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుపాను భారీగా ఆస్తినష్టం.. పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం కూడా వాటిల్లింది. అయితే ఆస్తి నష్టం వాటిల్లిందనేది ఇంత వరకూ అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటివరకూ 12 మంది చనిపోగా… 5 వేల గ్రామాలు, 50 పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ తుపాను థాటికి కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలకు తోడు… గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో వేల చెట్లు, కరెంటు స్తంభాలూ, సెల్‌ఫోన్ టవర్లు కుప్పకూలాయి. దీంతో ఒడిషా నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
 
కాగా.. నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒడిషాలో పర్యటించారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ప్రధాని ఒడిషాకు చేరుకున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ అనంతరం సీఎం నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేషీ లాల్‌తో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి అధికారులు తుపాను నష్టం గురించి నిశితంగా వివరించారు. మోదీ ఒడిషా పర్యటనలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ.. ఒడిషాను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఒడిషాకు ఇప్పటికే రూ. 381 కోట్లు  సాయం అందిస్తున్నట్లు ప్రకటించామని.. తక్షణసాయంగా మరో వెయ్యి కోట్లిస్తామని మోదీ తెలిపారు. ‘ఫణి’ తుపాన్‌ను ఒడిషా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని ప్రధాని చెప్పుకొచ్చారు.
 
ఇదిలా ఉంటే.. తుపాను బాధితులకు గాను ఏపీ ప్రభుత్వం రూ. 15కోట్లు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. విపత్తుల వల్ల కలిగే నష్ట తీవ్రత అపారమని బాధితులను ఆదుకోవడం మానవతా ధర్మంగా ఒడిషా ప్రభుత్వానికి అన్నివిధాలా సాయం అందిస్తామని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *