ఒడిషా తుపాను బాధితులకు భారీ విరాళం ప్రకటించిన ఏపీ


అమరావతి: ఒడిషాపై ఫణి తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. 200 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు బీభత్సం సృష్టించాయి. ఓ వైపు భారీ వర్షం.. మరోవైపు పెనుగాలులతో అనేక మంది నిరాశ్రయులై రోడ్డునపడ్డారు. కొన్ని చోట్ల ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. మరికొన్ని చోట్ల ఇళ్లలోని ఫర్నీచర్ కూడా గాలుల వేగానికి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఒడిషాలో పెద్ద ఎత్తునే ఆస్తినష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఒడిషాలో ప్రస్తుత పరిణామాలు గురించి తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలియజేశారు.
 
చంద్రబాబు వరుస ట్వీట్స్..
ఫొనీ తుపానుతో కకావికలమైన ఒడిషా బాధితులకు రూ.15 కోట్లు ఆర్ధిక సాయం అందిస్తున్నాం. విపత్తుల వల్ల కలిగే నష్ట తీవ్రత అపారం. బాధితులను ఆదుకోవడం మానవతా ధర్మంగా ఒడిషా ప్రభుత్వానికి అన్నివిధాలా సాయం అందిస్తాం. ‘నీ పొరుగువారిని నీ లాగానే ప్రేమించమన్న’ – జీసస్ క్రీస్తు. ‘సొంతలాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడమన్న’ – గురజాడ. ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లన్న’ భావం ఎల్లెడలా పెరగాలి. మానవ ధర్మంగా పొరుగు రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు గతంలోనూ ఆదుకున్నాం, ఇప్పుడూ ఆదుకుంటాం. విపత్తు బాధిత రాష్ట్రాలకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఒక సంజీవని అయ్యింది. టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో విలువైన ప్రాణాలు కాపాడుకోగలిగాం. ఆస్తి, జన నష్ట నివారణలో టెక్నాలజీ తోడ్పాటు శుభసూచకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇదెంతో గర్వకారణమైంది” అని చంద్రబాబు ట్విట్టర్‌లో తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *