ఓటర్లకి పదినోటు ఇచ్చిన రాజావారి సంగతేంటి..?


రాజుగారి రూటే సపరేటు. ఏ విషయం అయినా సరే సుత్తి లేకుండా సూటిగా చెప్పే ఆ రాజుగారు రాజకీయాల్లోనూ తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. పాతకాలంలో రాజుల సొమ్ము రాళ్లపాలు అనేవారు.. కానీ ఇప్పుడు ఈ రాజుగారి కొత్త పంథా ఎంచుకున్నారు! ఇంతకీ ఎవరా రాజుగారు? రాజకీయాల్లో ఏంటి ఆయన ప్రత్యేకత? ఈ కథనంలో తెలుసుకోండి.
 
   విష్ణుకుమార రాజు కేరాఫ్ బీజేపీ శాసస సభపక్షనేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే! ఇది ఆయన హోదా! వ్యక్తిగతంగా నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరుంది. నియోజకవర్గంలో పైసా తీసుకోకుండా.. ప్రజలకు సేవాచేసే గుణం ఆయనకే సొంతం. ఏ విషయంలో అయినా తేడా వస్తే మాత్రం తన, పర అన్న భేదాలు పాటించరు. ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే మాట్లాడేస్తారు.
 
    ఇదిలా ఉంటే, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన రాజుగారికి కూడా కొన్ని కష్టాలు తప్పలేదట. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు, వైసీపీ తరఫున కె.కె. రాజు బరిలో నిలిచారు. బీజేపీ పక్షాన విష్ణుకుమార రాజు రంగంలో ఉన్నారు. ఇక్కడే కొన్ని పితలాటకాలు చోటుచేసుకున్నాయట. వైసీపీ అభ్యర్థి కె.కె.రాజు తన సామాజికవర్గాన్ని వాడుకునే ప్రయత్నం చేశారన్నది విష్ణుకుమార రాజు ప్రధాన ఆరోపణ. “బీజేపీకి ఓటువేస్తే మురిగిపోతుందనీ.. ఆ పార్టీకి వేసే ఓట్లను కూడా కె.కె.రాజుకు వేయండి” అంటూ తాను చెప్పినట్టుగా కె.కె.రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణుకుమార రాజు తీవ్ర మండిపడ్డారు. “టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అవినీతిపరుడు.. నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు ఉన్న ఇమేజ్‌ను కె.కె.రాజు తప్పుడు ప్రచారంతో వాడుకోచూశారు” అంటూ విష్ణుకుమార రాజు ఎంతగా ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించలేదట. దీంతో మిగతా అభ్యర్థుల మాదిరే ఆయన కూడా ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారట. “నేను నీతివంతుడిని.. నిప్పు..” అని చెప్పుకున్న రాజుగారు కూడా అడ్డదారి తొక్కడమే ఆశ్చర్యకర పరిణామం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇక్కడ కూడా విష్ణుకుమార రాజు తనమార్క్‌ రాజకీయం పండించారట!
 
    విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓటుకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు పంపిణీ జరుగుతున్న తరుణంలో రాజుగారు సరికొత్త ప్లాన్‌కు తెరతీశారట. తన ప్లాన్ వర్కవుట్‌ అయితే మంచిదే. లేకపోయినా కూడా నష్టంలేని మార్గాన్ని ఎంచుకున్నారట. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లినప్పుడు.. ప్రతి ఓటరుకు కొత్తగా ముద్రించిన పదిరూపాయలు నోటును ఇచ్చారట. ఆయా నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను ఆయన అనుచరులు ఓ పుస్తకంలో నోట్‌ చేసుకున్నారట. “ఇదేంటీ.. ఇతర పార్టీల అభ్యర్థులు వెయ్యి నుంచి రెండు వేలు ఇస్తుంటే.. మీరు పది రూపాయల నోటు ఇచ్చి ఓటు అడుగుతున్నారు?” అని ఓటర్లు సందేహించారట. ఆ సమయంలో రాజుగారి అనుచరులు కల్పించుకుని.. అసలు విషయం చెప్పుకొచ్చారట. “మీ ఓటు రాజుగారికి వేసి గెలిపించండి. ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే.. మేము ఇచ్చిన పది రూపాయల నోటు తిరిగి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ రెండువేల రూపాయలు ఇస్తాం” అని భరోసా ఇచ్చారట. దీంతో రాజుగారి ప్లాన్‌ అర్థమైన ఓటర్లు సైతం అవాక్కయ్యారట.
 
    విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార రాజు పరపతికేం తక్కువలేదు. అడిగిన ప్రతి ఒక్కరికీ చేతనైన సాయం చేశారు. ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇళ్ల మంజూరు విషయంలో కూడా నిస్పక్షపాతంగా వ్యవహరించారన్న పేరుంది. అలాంటి నేతకి సైతం ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టాల్సి రావడమే నేటి రాజకీయాల మహిమ. రాజుగారు డబ్బులు పంచితే పంచారు కానీ.. ఈ విషయంలో ఆయన అమలుచేసిన ప్లాన్‌ మాత్రం చర్చోపచర్చలకి దారితీస్తుందని చెప్పక తప్పదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *