ఓట్ల లెక్కింపుపై సీఎస్‌ ఎలా సమీక్షిస్తారు!


  • సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై ఆయన తీరు అనైతికం
  • స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల పరిశీలన కోసమే స్విట్జర్లాండ్‌కు జగన్‌
  • టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వైవీబీ
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓట్ల లెక్కింపుపై సమీక్ష నిర్వహించడాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ తప్పుపట్టారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఆయన ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎలా సమీక్ష నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎస్‌ ఎందుకు సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదని నిలదీశారు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తుంటే.. సీఎస్‌, ఈసీలు అడ్డుపడటం దారుణమన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్న తీరు అనైతికమని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న టీడీపీ ప్రభుత్వం ఏఏ సంక్షేమ పఽథకాలకు ఎంతెంత నిధులు విడుదల చేయాలనే అంశంపై గతంలోనే స్పష్టతనిచ్చి ఉత్తర్వులు జారీ చేసిందని, బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల పేరుతో రాష్ట్రంలో పరిపాలనను అడ్డుకుంటూ ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.
 
రాద్ధాంతం చేస్తున్నారు
ప్రతిపక్ష నేత జగన్‌ స్విస్‌ బ్యాంకుల్లోని తన ఖాతాల్లో ఆర్థిక లావాదేవీలను సరిచూసుకునేందుకే స్విట్జర్లాండ్‌కు వెళ్లారని ఆరోపించారు. టీటీడీకి చెందిన బంగారం విషయంలోనూ వైసీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే ఎవరూ మాట్లాడకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొత్త నాగేంద్రకుమార్‌, నేతలు సయ్యద్‌ అజ్మతుల్లా, రాజులపాటి ఫణికుమార్‌ పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *