కదలని కాళ్లు.. కదిలిస్తే కన్నీళ్లు


  • ఆ అవ్వకు తోడు నీడా కరువు
  • చేరదీసినోడు కన్నుమూశాడు..
  • తొంటి విరిగి జీవచ్ఛవమైన వృద్ధురాలు
  • మూడు రోజులుగా ఎండ, వడగాలిలోనే…
  • వృద్ధాశ్రమంలోనైనా చేర్చాలని వేడుకోలు
విధి వెక్కిరించింది.. చేరదీసినోడు తనువు చాలించాడు.. వృద్ధాప్యం శాపంగా మారింది… కాలుజారిపడి తొంటి విరిగింది.. ఈ పరిస్థితుల్లో ఆ అవ్వను నడిరోడ్డుపైన వదిలి వెళ్లారు. ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు ప్రాణాలు తీసే వడగాలి.. ఈ పరిస్థితుల్లో రోడ్డుపాలైన వృద్ధురాలిపై స్థానికులు కనికరించారు. బస్‌ షెల్టర్‌ ఆమెకు నీడను ఇస్తే… స్థానికులే కడుపు నింపుతున్నారు. మూడు రోజులుగా నగరం నడిబొడ్డున వేంకటేశ్వర విజ్ఞాన మందిరం బస్‌స్టాప్‌లో చావు బతుకుల మధ్య ఈ వృద్ధురాలు కాలం వెళ్లదీస్తోంది.
 
గుంటూరు: గుంటూరు శారదాకాలనీ ఆరో లైన్‌కు చెందిన సమరౌతు సాయమ్మ అనే ఈ వృద్ధురాలికి వెనకా ముందు ఎవరూ లేరు. లాలాపేటలోని మిర్చి కమీషన్‌ కొట్టులో మిరపకాయల తొడాలు తీసే పనిచేస్తూ జీవనం సాగించేది. ఆ సమయంలో అక్కడ పనిచేసే సుభానితో పరిచయం ఏర్పడింది. శారదాకాలనీ 6వ లైన్‌లో ఉంటూ సహజీవనం సాగించారు. కాలక్రమేణా వృద్ధాప్యం ఆవరించడంతో కొద్దినెలల క్రితం సుభాని తన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం తీసుకెళ్లాడు. సుభాని కూలీ పనులు చేసి సాయమ్మను చూసుకున్నాడు. ఓ రోజు రాత్రి కరెంటు పోవడంతో చీకట్లో కనిపించక సాయమ్మ జారి పడింది. దీంతో ఆమె ఎడమకాలు తొంటి వద్ద విరిగింది. అయితే ఆసుపత్రిలో చూపించుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో మంచానికే పరిమితమైంది. అయినప్పటికీ సుభాని అన్నీ తానై చూసుకున్నాడు. జీవచ్ఛవమైన సాయమ్మకు అండగా నిలిచాడు. ఇలా ఉంటే ఐదురోజుల క్రితం సుభాని ఆకస్మికంగా కన్నుమూశాడు.
 
దీంతో ఆయన సోదరుడు స్థానిక మసీదు పెద్దల నుంచి చందాలు వసూలు చేసి అదే రోజు కార్యక్రమం పూర్తి చేశాడు. మనిషి చనిపోయిన తరువాత ఇంట్లో ఉండకూడదంటూ సాయమ్మను గుంటూరుకు తీసుకొచ్చి హిందూ కళాశాల ఎదురుగా గాంధీ పార్కు మూలన రోడ్డు పక్కన వదిలి వెళ్లాడు. ఆమెతో పాటు ఆమె సామాగ్రితో కూడిన ట్రంకు పెట్టెను కూడా అక్కడపెట్టాడు. అయితే కాలు కదపలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు ఆ రోజు ఎండలో మండింది. అయితే ఎదురుగా ఉన్న షోడా బండ్లు నిర్వహించే మహిళలు గమనించి ఆమెను చేరదీశారు. తమ రెండు బండ్ల మధ్య ఉన్న ఖాళీల మధ్యలోకి మోసుకొచ్చి కూర్చోబెట్టారు. తనకు ఎవరూ లేరని చెప్పడంతో వారే టిఫిన్‌ పెట్టి కడుపు నింపారు. అలా రెండు రోజులు గడిచాక మంగళవారం ఉదయం స్థానికులు ఆమెను పక్కనే ఉన్న బస్‌ షెల్టర్‌లోకి మార్చారు. ప్రస్తుతం వారు పెట్టే అల్పాహారంతో కడుపు నింపుకుంటోంది. కనీసం తొంటి ఆపరేషన్‌ చేయించే వారు కూడా కరువయ్యారు. కదల్లేని స్థితిలో, దిక్కుమొక్కులేని ఆ అవ్వ గుండె ధైర్యం పలువురిని విస్మయానికి గురిచేసింది.
 
ఆసుపత్రిలో చేర్పించి ఆపరేషన్‌ చేయిస్తామంటే ‘నాకు తోడు ఎవరుంటారు…? ప్రభుత్వాసుపత్రిలో ట్రంకుపెట్టె ఎలా పెట్టనిస్తారు..’ అంటూ ప్రశ్నించింది. ‘స్థానికులే తలా ముద్ద పెడుతున్నారు.. ఇక్కడే ఇలాగే కాలం వెళ్లదీస్తా..’ అని వాపోయింది. దిక్కుమొక్కులేని సాయమ్మకు దయగల దాతలు సాయం చేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆపరేషన్‌ చేయిస్తే నడవగల్గుతుందని, ఆ తరువాత ఏ వృద్ధాశ్రమంలోనైనా చేర్పించగల్గితే జీవిత చరమాంకంలో సాయపడినవారవుతారని స్థానికులు అంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *