కన్నీటి వెనుక కథ…!


  • కృష్ణమ్మ కాలుష్యానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వరంగ సంస్థలదే
  • రైల్వే, ఆర్టీసీల నుంచే 50 శాతం కాలుష్య కారకాలు
  • ఆ తర్వాతి స్థానంలో ప్రైవేటు ఆసుపత్రులు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు
  • నిత్యం మురుగునీరు కాల్వల్లోకి..
  • 18 మెట్రిక్‌ టన్నుల చెత్త కూడా కృష్ణానది కాల్వల్లోకే..
  • రెండు రోజుల్లో 1100 మెట్రిక్‌ టన్నుల చెత్త తొలగింపు
బెజవాడ నగరానికి అందాన్ని తీసుకొచ్చే మూడు కాల్వలు దశాబ్దాల తరబడి అధికారుల నిర్లిప్తత, ప్రజల నిర్లక్ష్యం కారణంగా మురుగు కూపాలుగా మారాయి. కృష్ణా కాల్వలను ప్రక్షాళన చేద్దాం.. అన్న మాట ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో నోళ్ల నుంచి వినిపిస్తున్నా అడుగు పడింది మాత్రం ఇప్పుడే. ‘నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో..’ పేరుతో కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌ కృష్ణమ్మకు కొత్త అందాలు అద్దేందుకు అడుగు వేశారు. గురు, శుక్రవారాల్లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా దిగ్ర్భాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కృష్ణమ్మను కాలుష్య కాసారంగా.. మురుగుకూపంగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలే కావడం విషాదం.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరం మధ్య నుంచి ఏలూరు కాల్వ, బందరు కాల్వ, రైవస్‌ కాల్వల ద్వారా కృష్ణమ్మ ప్రవహిస్తుంది. నగరం మధ్యలో నది పరవళ్లు తొక్కుతుంటే ఆ అందమే వేరుగా ఉంటుంది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ మూడు కాల్వలు నగర పరిధిలో 24 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నాయి. కాల్వలు ప్రవహిస్తున్న మేర ఒక్క నిమిషం కూడా నిలవలేని దుస్థితి. నగరవాసులకు వీఎంసీ నిత్యం 57 ఎంజీడీ(మిలియన్‌ గ్యాలన్స్‌ పర్‌ డే) రక్షిత నీటిని సరఫరా చేస్తుంటే అందులో 24 ఎంజీడీ నీరు మురుగ్గా మారి ఈ మూడు కాల్వల్లోకి చేరుతోంది. నగరంలో నిత్యం 550 మెట్రిక్‌ టన్నుల చెత్త, వ్యర్థాలు పోగవుతుంటే అందులో 18 మెట్రిక్‌ టన్నులు నేరుగా కాల్వల్లోకి చేరుతుంది. ఈ కారణాలతో మూడు కాల్వలు మురుగు కూపాలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ కృష్ణమ్మ శుద్ధికి ఉపక్రమించారు. సుమారు నెల రోజులపాటు అధికార యంత్రాంగంతో చర్చించి కృష్ణమ్మ శుద్ధికి పక్కా ప్రణాళిక తయారు చేశారు. నగరంలో ప్రవహిస్తున్న మూడు కాల్వల్లో వ్యర్థాలు ఎక్కువగా కలుస్తున్న 81 ప్రదేశాలను గుర్తించారు. వీటిలో 21 ప్రదేశాలు అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఈ 21 ప్రదేశాల్లో రైల్వే, ఆర్టీసీ, ప్రభుత్వ అతిథిగృహాలు, కార్యాలయాలు ఉండటం గమనార్హం. రైల్వే స్టేషన్‌, ఇతర రైల్వే అనుబంధ ప్రదేశాల నుంచి పెద్ద ఎత్తున మురుగు కృష్ణా నది కాల్వల్లో కలుస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి శుద్ధి చేయకుండా వీటిని నేరుగా కాల్వల్లోకి వదిలేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, పరిశ్రమల నుంచి కూడా పెద్ద ఎత్తున కలుషితాలు కాల్వల్లోకి చేరుతున్నట్లు గుర్తించారు. ఫలితంగా కృష్ణా నీటిలో కోలీఫామ్‌ పెరుగుతున్నట్లు, తాగడానికి పనికిరాని విధంగా కృష్ణా జలాలు తయారవుతున్నట్లు తేలింది. సాధారణంగా ఒక లీటరు నీటిలో బయో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీవోడీ) మూడు మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండాలి. కానీ కృష్ణా నదిలో ఇది 4 మిల్లీగ్రాముల వరకు ఉన్నట్లు తేలింది. అలాగే 100 ఎంఎల్‌ నీటిలో టోటల్‌ కోలీఫామ్‌ బ్యాక్టీరియా 50 ఎంపీఎన్‌ కంటే తక్కువ ఉండాల్సి ఉండగా, హంసలదీవి వద్ద కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశంలో 100 ఎంఎల్‌ కృష్ణా నీటిలో 1264 ఎంపీఎన్‌ కోలీఫామ్‌ ఉన్నట్లు గుర్తించారు.
 
కట్టడికి వ్యూహం..
కృష్ణా నది కాల్వల కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉన్నవారిని గుర్తించి కట్టడి చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. రైల్వేలు, ఆర్టీసీతోపాటు ప్రైవేటు సంస్థల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే కాల్వల్లోకి వదిలేలా చర్యలు తీసుకోనున్నారు. దీన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే కాల్వల వెంబడి నిర్మాణ వ్యర్థాలను, ఇతర వ్యర్థాలను వేసేవారిపైనా చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు నిర్దేశిత ప్రాంతాల్లో కాల్వల వెంబడి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కాల్వల వెంబడి నివసించే ప్రజల్లోనూ చైతన్యం తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. తమ ఇళ్ల నుంచి నేరుగా మురుగు, చెత్తను కాల్వలోకి పంపకుండా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. కాల్వల్లోకి మురుగు, చెత్త పంపే ఇళ్లను గుర్తించి జరిమానాల విధించాలన్న ప్రతిపాదన ఉంది.
 
క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా చర్యలు..
విజయవాడ నగరంలో కాల్వల్లోకి మురుగు ఎక్కువగా చేరే 15 ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాలకు ఒక్కో జిల్లా అధికారిని బాధ్యుడిగా నియమించారు. ఇక్కడ కాల్వల కాలుష్యానికి కారణాలను గుర్తించి, ఏ విధంగా చర్యలు తీసుకుంటే కాల్వలను శుద్ధి చేయగలమన్న దానిపై తగిన సూచనలు చేయాలని కలెక్టర్‌ వారిని కోరారు. ఈ నివేదికలు సోమవారంలోగా తనకు ఇవ్వాలని సూచించారు. వాటి ఆధారంగా భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించేందుకు మంగళ, బుధవారాల్లో ఆయన సంబంధిత అధికారులతో మరోసారి భేటీ కానున్నారు.
 
కాలుష్య కాసారంగా.. బెజవాడ
  

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *