కన్హయ్య నాకు పోటీనే కాదు: గిరిరాజ్ సింగ్


బెగుసరాయ్: సీపీఐ లోక్‌సభ అభర్థి కన్హయ్య కుమార్, ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్ తనకు పోటీనే కాదని వారిపై బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ అన్నారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, బెగుసరాయ్ నుంచి తనకు ఎవరూ పోటీ కాదని, తనకు తానే పోటీ అని ఆయన చెప్పారు. గతంలో భూకబ్జాలు, పరిశ్రమల లాకౌట్ వంటి హింసాత్మక తిరుగుబాట్ల వల్ల బెగుసరాయ్ ప్రజలు చేదు అనుభవాలను చవిచూశారని, విపక్షాల దుష్ట పన్నాగాల నుంచి ప్రజలను జాగృతం చేయడమే తన కర్తవ్యమని, అప్పుడు సాధించే విజయం చాలా గొప్పగా ఉంటుందని అన్నారు.
 
రాహుల్ పారిపోయారు…
అమేథీలో ఓడిపోతానని గ్రహించడం వల్లే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీకి నిర్ణయం తీసుకున్నారని గిరిరాజ్ సింగ్ విమర్శించారు. వయనాడ్‌లో నామినేషన్ వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క జెండా కూడా కనిపించలేదని, అర్ధ చంద్రకారంతో ఉన్న ఆకుపచ్చ జెండాలే ఉన్నాయని, దీనిని బట్టి ఆయన కేరళ నుంచి కాకుండా పాకిస్థాన్‌ నుంచి పోటీ చేస్తున్నట్టు కనిపించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాతో పనిచేస్తోందని తప్పుపట్టారు. ‘వాళ్లు ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారు. మన సైనికులపై ప్రశ్నలు సంధిస్తున్నారు. సర్జికల్ దాడుల ఆధారాలు అడుగుతున్నారు. గతంలో మణిశంకర్ అయ్యర్, ఇప్పుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు. తన రోడ్డుషోలను అడ్డుకుంటున్నారంటూ కన్హయ్య కుమార్ వ్యాఖ్యానించడంపై అడిగినప్పుడు, తన పోరాటమంతా సిద్ధాంతాలపైనే కానీ వ్యక్తులతో కాదని సింగ్ సమాధామిచ్చారు. కాగా, బీహార్‌లో ఇంతవరకూ మూడు విడతల ఎన్నికలు పూర్తి కాగా, తక్కిన నాలుగు విడతల పోలింగ్ ఈనెల 29, మే 6, 12, 19 తేదీల్లో జరుగనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *