కవులూరులో 14వ శతాబ్ది తెలుగు శాసనం


కవులూరు: పాతకవులూరులో క్రీ.శ 14వ శతాబ్దానికి చెందిన శాసనాన్ని సోమవారం పురావస్తు పరిశోధకుడు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతి సీఈవో ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. గ్రామానికి చెందిన సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన ఆ శాసనం వాస్తవానికి 1992లోనే బయల్పడింది. దాన్ని ఆలయం వద్దకు తీసుకువచ్చి గ్రామస్థులు ఉంచారు. అది ఎండకు ఎండుతుందని, వానకు తడుస్తుందని గ్రామానికి చెందిన గరిమెళ్ల బాబురావు అలియాస్‌ దేశం బాబురావు అనే వ్యక్తి పురావస్తుశాఖను ఇచ్చిన సమాచారం మేరకు వచ్చి ఆశాసనాన్ని పరిశీలించినట్లు శివనాగి రెడ్డి తెలిపారు.
 
క్రీ.శ 1383 సంవత్సరం పుష్యమాసం బహుళచతుర్దశి ఆదివారం స్థానికుడైన గౌతమి నాయకుడు తమ తల్లిదండ్రులు అరినమి నాయకుడు కునిసాని పుష్యంగ శ్రీవరద గోపీనాథుడికి ఫల వృక్షాల సహితంగా ఒక తోటను సమర్పించిన విషయం శాసనంలో చెక్కి ఉందని ఆయన తెలిపారు. చారిత్రిక ప్రాధాన్యమున్న ఈ శాసనాన్ని పీఠంపై నిలబెట్టి భద్రపరచాలని ఆయన గ్రామస్థులను కోరారు. కార్యక్రమంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడు గూడపాటి పద్మశేఖర్‌, అమరావతి బుద్ధవిహార కార్యదర్శి మేడసాని శుభాకర్‌, చెరుకూరి హరికృష్ణ, గొంది సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *