కశ్మీర్‌పై చైనాను దువ్వుతున్న పాక్…!


బీజింగ్: కశ్మీర్ వివాదంలోకి చైనాను లాగేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి ప్రయత్నించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహా ఇతర చైనా నేతలతో సమావేశమైన సందర్భంగా ఇమ్రాన్ ఈ అంశంపై చర్చించారు. పాకిస్తాన్-చైనా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం సమావేశం కోసం బీజింగ్ వెళ్లిన పాక్ ప్రధాని.. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ‘‘తూర్పున ఉన్న మా పొరుగుదేశంతో పౌర సంబంధాలు నిర్మించుకోవాలని ఆశిస్తున్నాం. కశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటే ఈ సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి…’’ అని ఇమ్రాన్ పేర్కొన్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వ రేడియో వెల్లడించింది.
 
పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాల నుంచి ఇటీవల చైనాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఇప్పుడు మసూద్ అజార్ విషయమై తన వైఖరిని చైనా పునఃసమీక్షించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడితో ఇమ్రాన్ ఖాన్ సమావేశం కావడం గమనార్హం. మసూద్ అజార్‌పై అంతర్జాతీయ ఉగ్రవాద ముద్ర పడకుండా కాపాడుతున్న ఒకే ఒక దేశం చైనా అన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న చైనా… మసూద్ అజార్ విషయంలో కూడా అంతే మద్దతుగా ఉంటూ వచ్చింది.
 
మసూద్ అజార్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తడి పెరుగుతుండడంతో…  అతడి నిషేధం విషయమై పాకిస్తాన్‌‌ను ఒప్పించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అన్ని విషయాల్లోనూ పాకిస్తాన్‌కు అండగా ఉంటామంటూ చైనా అధ్యక్షుడు భరోసా ఇచ్చినట్టు కనిపిస్తోంది. ‘‘చైనాకు పాకిస్తాన్ ఎప్పటికీ మంచి వ్యూహాత్మక భాగస్వామే. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ.. పాకిస్తాన్‌కు చైనా పూర్తి మద్దతుగా నిలుస్తుంది. పాకిస్తాన్, సార్వభౌమత్వం, దేశ అభ్యున్నతికి రక్షణ కవచంగా ఉంటాం…’’ అని జిన్‌పింగ్ భరోసా ఇచ్చారు.  ఏదైనా కఠిన నిర్ణయానికి ముందు తియ్యటి మాటలు చెప్పడం, ఆర్ధిక సాయం చేయడం చైనా నాయకులకు అలవాటేనని విశ్లేషకులు చెబుతున్నారు. మసూద్ అజార్‌ నిషేధం విషయమై పాకిస్తాన్‌ను ఒప్పించేందుకే చైనా ఈ మేరకు ముందుకొచ్చినట్టు భావిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *