కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల హెచ్చరికలతో ఆందోళనలో సీఎం


బెంగళూరు: తమను సీఎం, జేడీఎస్‌ మంత్రులు ఎమ్మెల్యేలుగా పరిగణించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తితో సీఎం కుమారస్వామి ఇబ్బందుల్లో పడ్డారు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చించాలని సీఎం కుమారస్వామి భావించారు. ఇందుకోసం ముహూర్తం కుదుర్చుకున్నా రెండుసార్లు వాయిదా పడింది. రోజుకు 10మంది ఎమ్మెల్యేల చొప్పున భేటీ అవుతానని నేరుగా ‘వన్‌ టు వన్‌’ పద్దతిన వారి సమస్యలపై చర్చిస్తానన్నారు. అయితే ముఖ్యమంత్రి అనుకున్న సమావేశాలు వాయిదాపడ్డంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దాదాపు అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరపకపోతే భవిష్యత్తులో చోటుచేసుకునే పరిణామాలకు తాము బాధ్యులం కామని హెచ్చరించారు.
 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో చర్చకు సీఎం సిద్ధమైతే తమకు కూడా చర్చలకు అవకాశం ఇవ్వాలని జేడీఎస్‌ నేతలు కోరినట్లు తెలుస్తోంది. బోర్డులు, కార్పొరేషన్‌, చైర్మన్‌ల పంపిణీలోనూ ఇరు పార్టీల మధ్య పెను వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి పదవులు దక్కనివారు బోర్డులు, కార్పొరేషన్‌లతోనే సర్దుకుపోగా అటు మంత్రి పదవి ఇటు బోర్డులు, కార్పొరేషన్‌ల అవకాశాలు లేనివారు అసంతృప్తులుగా మిగిలిన విషయం తెలిసిందే. సీఎం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు వెనుకడుగు వేస్తే ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా సమస్యలు తెలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రం సిద్దరామయ్య కనుసైగలలోనే ఉన్నారు. సమన్వయ కమిటీలో చర్చలు జరిపి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినా అవి పరిష్కారం కాకపోవడం కొందరి అసంతృప్తికి కారణమవుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *