కూచిపూడి గురుకులాలను ప్రోత్సహించాలి


విజయవాడ కల్చరల్: ఆంధ్రుల సాంస్కృతిక ప్రతీక అయిన కూచిపూడి నృత్యం ప్రపంచ ఖ్యాతిని దక్కించుకుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫైర్‌ నైట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ అన్నారు. మొగల్రాజపురంలోని విజయవాడ కల్చరల్‌ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం విజయవాడ కల్చరల్‌ సెంటర్‌, శ్రీనివాస ఫామ్స్‌ సంస్థల ఆధ్వర్యంలో నెలనెలా నిర్వహిస్తున్న నాట్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా నాట్యాచార్య అజయ్‌కుమార్‌ శిష్యులు లావణ్య, నిహారిక, శ్రీదేవి కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వంశపారంపర్యంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న కూచిపూడి గురుకులాలను ప్రోత్సహించా లన్నారు. ప్రముఖ నాట్యాచార్యులు సింగారం అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ మహాలక్ష్మి సంస్థ కూచిపూడి నాట్య వికాసానికి ఎనలేని కృషి చేస్తోందన్నారు. కల్చరల్‌ సెంటర్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ కూచిపూడి నృత్యం పుట్టుపూర్వోత్తరాలను, ఆ నాట్యానికి దక్కిన ప్రపంచ ఖ్యాతిని సభికులకు వివరించారు. తదుపరి లావణ్య, నిహారిక, శ్రీదేవిలు ప్రదర్శించిన నాట్యాంశాలు విశేషంగా అలరించాయి. ముందుగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచించిన వినాయక కౌత్వానికి ప్రారంభ నృత్యం చేసి తదుపరి సిద్ధేంద్ర యోగి రచించిన సత్యభామ ప్రవేశ దరువును ప్రదర్శించి కూచిపూడి నాట్య వైభవ ప్రాభవానికి అద్దం పట్టారు.
 
మూడవ అంశంగా కె.వి.సత్యనారాయణ కూర్చిన శ్రీరాజగోపాల అంశం, మరకతమణిమయ, నారాయణ తీర్థులు రచించిన ఆలోకయే సఖి బాలకృష్ణం, తిల్లానా వంటి అంశాలకు మంత్రముగ్ధుల్ని చేసే నాట్య అభినయ విన్యాసాలతో కనువిందు చేశారు.
 
అనంతరం నాట్యాచార్య అజయ్‌కుమార్‌తో పాటు నర్తకీ మణులను సంస్థ ఘనంగా సత్కరించి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందించింది. ఈ కార్యక్రమంలో మాలక్ష్మి ప్రాపర్టీ సీఈవో సందీప్‌ మండవ, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *