కూల్‌ కూల్‌గా..


  • జోరందుకున్న ఏసీల వ్యాపారం
  • గ్రామాల్లోనూ అధికంగా కొనుగోళ్లు
  • ఆఫర్లు ప్రకటిస్తున్న కంపెనీలు
  • క్యూలు కడుతున్న వినియోగదారులు
ఏసీలు..ఏసీలు..ఏసీలు.. ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ విన్నా ఇదే మాట. రోజురోజుకూ ఎండ వేడిమి పెరిగిపోతుండటంతో అందుకు తగ్గట్టుగానే ఏసీల వ్యాపారం కూడా తారస్థాయికి చేరుతోంది. నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామాల్లోనూ కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుండటంతో పలు సంస్థలు అనేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
 
ఆంధ్రజ్యోతి విజయవాడ: భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. వచ్చే మే నెలను తలచుకుంటేనే ప్రజలకు భయమేస్తోంది. ఈ పరిస్థితుల్లో చల్లదనం కోసం అందరూ ఏసీలు కొనేస్తున్నారు. దీంతో ఈ వేసవిలో ఎయిర్‌ కండిషనర్ల వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోంది. నగరాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఏసీల కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. పక్షం రోజులుగా జిల్లాలో ఏసీలు కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫైనాన్స్‌ కంపెనీలు రంగంలోకి దిగటంతో సులభ వాయిదాల పద్ధతుల్లో కొనేవారూ అధికంగానే ఉన్నారు. ఫైనాన్స్‌ సంస్థలు నిబంధనలు సడలించి.. కేవలం ఆధార్‌ కార్డు ఆధారంగా రుణాలు ఇస్తున్నాయి. ఇక వ్యాపార సంస్థలేమైనా తక్కువ తిన్నాయా.. ఏసీ కొంటే ఖరీదైన గృహోపకరణాలు ఉచితమని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఎల్‌ఈడీ టీవీ దగ్గర నుంచి మైక్రో ఒవెన్‌, గ్యాస్‌ స్టవ్‌.. ఇలా అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
 
1.5 టన్నుల ఇన్వర్టర్‌ ఏసీలకే డిమాండ్‌
1.5 టన్నుల ఏసీలకే డిమాండ్‌ ఎక్కువగా ఉంది. గతంలో విండో ఏసీలే అధికంగా కొనేవారు. ఈసారి మాత్రం సింహభాగం స్ప్లిట్‌ ఏసీల పట్లే ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఏసీలను కొనుగోలు చేసేవారు అవగాహనతోనే వస్తున్నారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తమ దగ్గర స్పెసిఫికేషన్స్‌ ఏమిటో తెలుసుకునేవారని, ప్రస్తుతం వినియోగదారులే ఫలానా స్పెసిఫికేషన్‌ ఉందా అని అడుగుతున్నారంటున్నారు. ఇంటర్నెట్‌లో ఏసీల గురించి తెలుసుకున్న తర్వాతే కొనుగోలుకు వస్తున్నారని చెబుతున్నారు.
 
మార్కెట్‌లో లభిస్తున్న ఎయిర్‌ కండిషనర్‌లు
నగర మార్కెట్‌లో 1.5 టన్ను శ్రేణిలో ఎల్‌జీ, డాయ్‌కిన్‌, శామ్‌సంగ్‌, హితాచి కంపెనీలు 5 స్టార్‌ కేటగిరీలో ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ ఏసీలను అందుబాటులోకి తెచ్చాయి. 4 స్టార్‌ కేటగిరీలో బ్లూస్టార్‌, క్యారియర్‌, డాయ్‌కిన్‌ కంపెనీలు ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ ఏసీలు ఉన్నాయి. ఇక త్రీ స్టార్‌ కేటగిరీలో ఎల్‌జీ, ఓల్టాస్‌, హితాచి సంస్థలు ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ ఏసీలను మార్కెట్‌లోకి తెచ్చాయి.
 

కామన్‌ ఫీచర్లు
ఏసీ కంపెనీలన్నీ కామన్‌ గ్యారంటీ ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తమ ఇష్టాన్ని బట్టి ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు గోల్డ్‌ ఫిన్‌ కండెన్సర్‌ టెక్నాలజీని తీసుకురావటంతో వీటి లైఫ్‌టైమ్‌ కూడా ఎక్కువ. ఏసీలోని ఇన్వర్టర్‌ కంప్రెసర్‌ ఇంధన వ్యయాన్ని తగ్గించటంతో పాటు ఖర్చును కూడా అదుపు చేస్తుంది. వీటిలో లో-రిఫ్రిజెంట్‌ డిటెక్షన్‌ ఫంక్షన్‌ ఉంది. చల్లదనం ఏ వైపున తక్కువగా ఉందో గుర్తించి అటువైపు తిరిగే సామర్థ్యం వీటికుంది. గదిలో ఉన్న గాలిని త్వరగా చల్లబరచటంతో పాటు తేమ శాతాన్ని కంట్రోల్‌ చేస్తాయి. ఇన్‌బిల్ట్‌ స్టెబిలైజర్‌ సదుపాయం అదనం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *