కేబినెట్‌ భేటీ!


 • వచ్చే వారమే నిర్వహిస్తాం
 • గీత దాటిన అధికారులపై చర్చిస్తాం
 • అతి చేసే వాళ్లు సరి కావాల్సిందే!
 • మోదీ 4 కేబినెట్‌ సమావేశాలు పెట్టారు
 • మాకు మాత్రమే కోడ్‌ వర్తిస్తుందా?
 • సీఎస్‌ రిపోర్ట్‌ చేయాల్సింది సీఎంకే
 • సాధారణ పాలనపై సంప్రదించాలి
 • సమీక్షలకు రమ్మని నేను అడగాలా?
 • ఆయన నిబంధనలు చదువుకోలేదా?
 • వీవీప్యాట్‌ల లెక్క పక్కాగా తేలాలి
 • తేడా వస్తే నియోజకవర్గమంతా లెక్కింపు
 • మోదీ మళ్లీ రారని అర్థమైపోతోంది
 • ఒకటిరెండు పార్టీల వైఖరి మారింది
 • మరికొన్ని పార్టీలూ కలిసి వస్తాయి
 • ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): వచ్చేవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ పేరిట ‘బిజినెస్‌ రూల్స్‌’ను ఉల్లంఘిస్తున్న అధికారుల తీరుపై చర్చిస్తామని తెలిపారు. శుక్రవారం చంద్రబాబు ఉండవల్లి ప్రజా వేదికలో మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కోడ్‌ అడ్డుకాదా అని ప్రశ్నించగా… ‘‘నియమావళి అమలులోకి వచ్చాక ప్రధానమంత్రి మోదీ నాలుగు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకున్నారు. ఎన్నికల కోడ్‌ ఆయనకు వర్తించదా? మాకే వర్తిస్తుందా?’’ అని ప్రశ్నించారు.
 
ఒకవేళ మంత్రివర్గ సమావేశం పెట్టేందుకు వీల్లేదంటే… ఆ విషయం ఎన్నికల సంఘం రాతపూర్వకంగా చెప్పాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నియమించిన ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తీరుపై ఆయన మరోసారి మండిపడ్డారు. కోడ్‌ ఉన్నప్పుడు కూడా ఆయా రాష్ట్రాల సీఎస్‌లు ముఖ్యమంత్రికే రిపోర్ట్‌ చేస్తున్నారని తెలిపారు. ‘‘ఇక్కడ మాత్రం సీఎస్‌ సమీక్షలకు రారట! రిపోర్టు చేయరట! రమ్మని నేను అడగాలా? అధికారులకు బిజినెస్‌ రూల్స్‌ నుంచి అధికారాలు సంక్రమిస్తాయి. ఆ బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా వెళ్లడం ఏంటి? ఆయన నిబంధనలు చదువుకోలేదా? బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.
 
అధికారుల్లో విభజన తీసుకురావడం తన ఉద్దేశం కాదని… కానీ, నిబంధనలకు విరుద్ధంగా, అతి చేసేవాళ్లు మాత్రం సరి కావాలన్నారు. వ్యవస్థలే వారిని సరిచేస్తాయని వ్యాఖ్యానించారు. ‘‘సీఎ్‌సగా మూడునెలలు ఉంటారు. నిబంధనల మేరకు వ్యవహరించాలి. ఎన్నికలకు సంబంధించిన విధులు వేరు. సాధారణ పరిపాలన వేరు. రోజువారీ పాలనకు సంబంధించిన అంశాల్లో సీఎంకే సీఎస్‌ నివేదించాలి. ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే వ్యవస్థే సరిచేస్తుంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లి పనుల పురోగతిని పర్యవేక్షిస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, సదరు ఫైలు ఇంకా తమ వద్దకు రాలేదన్నారు. దీనిపై ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్ణయం తీసుకుంటామన్నారు.
 
మోదీ మాటలు ఈసీకి సంగీతమే
నరేంద్ర మోదీ మళ్లీ గెలవరని ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా అందరికీ అర్థమైందని చంద్రబాబు అన్నారు. దీంతో తాజాగా రెండు పార్టీలు తమ వైఖరిని మార్చుకుంటున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీలేంటన్నది ఇప్పుడే వెల్లడించనని… మరికొన్ని పార్టీలు కూడా వాటితో కలిసి వస్తాయని అన్నారు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో జాతీయ రాజకీయాలపై ఏమైనా మాట్లాడారా? అని ప్రశ్నించగా…తుపాను సాయంపై రెండుసార్లు మాట్లాడానని బదులిచ్చారు. ఇక… మోదీ ఏం మాట్లాడినా ఈసీకి సంగీతంలాగే ఉంటుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని పశ్చిమ బెంగాల్‌లో మోదీ ప్రకటించినా పట్టించుకోలేదన్నారు. ఇక… ఫణి తుఫాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో వేగంగా స్పందించి ప్రజలకు సాయం అందించేందుకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని అడిగితే… తాపీగా తుఫాను తీరం దాటాక అనుమతి ఇచ్చిందని తెలిపారు. అంతకుముందే తుఫానుపై అధికారులతో సమీక్ష చేసి సమన్వయం చేశామని తెలిపారు. ‘‘మొన్నటివరకు అధికారులుగా ఉన్నవారే ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమితులయ్యారు. మోదీ వారిని నియమించినంత మాత్రాన హద్దులు దాటి ప్రవర్తించకూడదు. రాష్ట్ర సీఈవోకు కూడా ఇదే వర్తిస్తుంది’’ అని అన్నారు.
 
జగన్‌కు ఇక్కడ పనిలేదుగా!
జగన్‌ తాజాగా హైదరాబాద్‌లో ‘అవెంజర్స్‌… ద ఎండ్‌ గేమ్‌’ సినిమా చూశారని ఒక పాత్రికేయుడు ప్రస్తావించగా… ‘‘చూడనివ్వండి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇక్కడ సమస్యలేమీ లేకుండా సజావుగా చూసుకుంటోంది కదా! ఇక ఆయనకు ఇక్కడ ఏ పనీ లేదు. హైదరాబాద్‌లో కేసీఆర్‌తో టచ్‌లో ఉంటూ హాయిగా ఉన్నారు. ఆయనకు ఇక్కడ తుఫాన్లు, ప్రజలు ఎవరూ పట్టరు’’ అని చంద్రబాబు బదులిచ్చారు.
 
తేడా వస్తే మొత్తం లెక్కించాల్సిందే!
వీవీ ప్యాట్ల లెక్కింపుపై 23 రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంఘాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయడం సంతోషకరమని చంద్రబాబు చెప్పారు. వీవీప్యాట్‌లు లెక్కించేందుకు ఆరురోజుల సమయం పడుతుందంటూ సుప్రీంకోర్టును ఈసీ తప్పుదారి పట్టిస్తోందని తెలిపారు. ‘‘కనీసం 50శాతం పోలింగ్‌ కేంద్రాల్లోని వీవీప్యాట్‌లు లెక్కించాలని కేసు వేశాం. సుప్రీం తీర్పు ఆదేశాల మేరకు నియోజకవర్గానికి ఐదు పోలింగ్‌ బూత్‌లలోని వీవీప్యాట్‌లను లెక్కిస్తారు. తేడా వస్తే స్లిప్పుల్లో వచ్చిన ఓట్లే ఫైనల్‌ అని ఈసీ అంటోంది.
 
ఐదు ఈవీఎంలలో తేడా వస్తే మిగిలిన వాటి మాటేమిటి? తప్పు చేసినోళ్లు అక్కడితో ఆగరు కదా! తేడా వస్తే మొత్తం నియోజకవర్గంలోని వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వీవీప్యాట్‌ యంత్రాల కోసం రూ.9,200ల కోట్లు ఖర్చు చేసింది తప్పులున్నా వదిలేయడానికి కాదు కదా అని అన్నారు. లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించాలంటూ దొంగ ఫిర్యాదులు చేసిన ఐపీ అడ్ర్‌సలు ఇవ్వాలని అడిగితే ఎన్నికల సంఘం ఇంతవరకూ చెప్పలేదని చంద్రబాబు తెలిపారు. దొంగలను కాపాడే పనిలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఈసీకి కూడా కొన్ని హద్దులుంటాయని, ఆ హద్దులు దాటి వ్యవహరించకూడదని పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *