కేరళలో శ్రీలంక తరహా ఆత్మాహుతి దాడికి యత్నం?


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: శ్రీలంకలో జరిపిన మారణహోమం తరహాలో కేరళలోనూ ఆత్మాహుతి దాడి జరపడానికి ప్రయత్నం జరిగినట్లు బయటపడింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తెలిపిన వివరాల ప్రకారం శ్రీలంక ఆత్మాహుతి దాడుల సృష్టికర్త జహ్రాన్‌ హషీమ్‌ అనుచరుడు.. రియాజ్‌ అబూబకర్‌ అలియాస్‌ అబూ దిజానా అనే వ్యక్తి దీనికి కుట్ర పన్నాడు. పలక్కడ్‌ నివాసి అయిన రియాజ్‌- తాను ఏడాదికాలంగా హషీమ్‌ ప్రసంగాలను, జకీర్‌ నాయక్‌ బోధలను ఆలకిస్తున్నట్లు, వారి ప్రభావం తనపై ఎక్కువగ ఉన్నట్లు చెప్పాడు. ఏదేనా చర్చిలో- వీలైతే పలక్కడ్‌లోనే.. ఆత్మాహుతి దాడి జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాడు.
 
చాలా కాలంగా పరారీలో ఉన్న అఫ్గానిస్థాన్‌కు వెళ్లిపోయినట్లు భావిస్తున్న ఐఎస్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రషీద్‌ అబ్దుల్లాతోనూ, సిరియాలో ఐఎస్‌ శిక్షణలో ఉన్న, వలపట్టణానికి చెందిన అబ్దుల్‌ ఖయ్యూమ్‌ అలియాస్‌ అబూ ఖాలిద్‌తోనూ చాలా కాలంగా తాను ఆన్‌లైన్‌లో సంభాషిస్తున్నట్లు తెలిపాడు. నలుగురు వ్యక్తులు అబ్దుల్‌ రషీద్‌, అబూ ఖాలిద్‌ల సలహాలతో దుశ్యర్యలకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారమందిన ఎన్‌ఐఏ రంగంలోకి దిగి కాసర్‌గోడ్‌, పలక్కడ్‌ల్లో స్లీపర్‌సెల్స్‌పై నిఘా పెట్టింది.. అనేకమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. చివరకు రియాజ్‌ అబూబకర్‌ చిక్కాడు. బుధవారం నాడు కొచ్చిన్‌లోన కోర్టులో రియాజ్‌ను ఎన్‌ఐఏ హాజరుపర్చనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *