కొచ్చి.. తూచ్‌!


  • పర్యాటకుల ఆశలపై.. స్పైస్‌జెట్‌ నీళ్లు
  • కేరళ రాష్ర్టానికి విమాన సర్వీసు తాత్కాలికంగా రద్దు
  • నెల రోజుల నుంచి పునరుద్ధరణకు నోచుకోలేదు
  • షెడ్యూల్‌ ఉన్నా… ఆన్‌లైన్‌ బుకింగ్‌ లేదు.. !
  • ఈ వేసవిలో కేరళ వెళ్లాలనుకున్న వారికి నిరాశే
విజయవాడ (ఆంధ్రజ్యోతి): మండు వేసవిలో నగరం విహార యాత్రలకు బయలుదేరివెళ్లే వారు ఎక్కువగా కేరళ, గోవాలకు ఆసక్తి చూపుతారు. ఆ తర్వాత కైలాస్‌ మానస్‌ సరోవర్‌, లక్నో, రాజస్థాన్‌, ముంబాయి, ఢిల్లీ, కలకత్తాలు వెళుతుంటారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. పర్యాటకులు మొదటగా ప్రాధాన్యత ఇచ్చేది కేరళ కావటం గమనార్ణం. కేరళ ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఇక్కడి సంస్కృతి, చారిత్రక సంపద, కళలు, కళాఖండాలు, బీచ్‌లు, నదీతీరాలు, హిల్‌స్టేషన్స్‌, ఫెస్టివల్స్‌, ఆహారం పట్ల పర్యాటకులు ఫిదా అవుతుంటారు. కేరళలో గడిపితే మనసు దూదిపింజలా మారి పోతుందని పర్యాటకులు భావిస్తుంటారు. కేరళ వెళ్లాలంటే విజయవాడ నగర వాసులకు రైలు ప్రయాణం మాత్రమే అందుబాటులో ఉంది. కేరళకు చెప్పుకోదగిన సంఖ్యలో రైళ్లు లేవు. ఇక్కడి నుంచి నేరుగా వెళ్లేవి అసలు లేవు. పైనుంచి వచ్చే రైళ్లు మాత్రమే ఉన్నాయి. వీటి బుకింగ్‌పైనే జరిగిపోతుంది. సీటు దొరికితే గొప్పే. ఇలాంటి పరిస్థితులలో కేరళ వెళ్లటానికి ప్రైవేటు క్యాబ్‌లను మాట్లాడుకుని వెళ్లేవారు కూడా ఉన్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సరిగ్గా ఇలాంటి పరిస్థితులలో మూడు నెలల కిందట స్పైస్‌జెట్‌ సంస్థ విజయవాడ విమానాశ్రయం నుంచి కేరళ రాష్ర్టానికి కనెక్టివిటీ ఫ్లైట్‌ను ప్రారం భించింది. విజయ వాడ నుంచి తిరుపతి అక్కడి నుంచి కొచిన్‌ తిరిగి బెంగళూరు మళ్లీ అక్కడినుంచి విజయవాడ విమానాశ్రయం చేరుకునేలా వినూత్నంగా రూట్‌ను నిర్దేశించుకుని కొచ్చి సర్వీసును ప్రారంభించింది. వేసవిలో ఈ సర్వీసుకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుందని విమానాశ్రయ అధికారులతో పాటు, స్పైస్‌ జెట్‌ సంస్థ కూడా అంచనా వేసింది. విజయవాడ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, ఉభయగోదావరి జిల్లా ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న ప్రైవేటు ట్రావెల్‌ సంస్థలు కూడా ఈ సర్వీసుపై ఎంతో నమ్మకం పెట్టు కున్నాయి. విమానం ద్వారా ప్యాకేజీలు కల్పించ టానికి ప్రైవేటు టూర్‌ ఆపరేటర్స్‌ కూడా ప్రణాళికలు వేసుకుంటున్న దశలో స్పైస్‌జెట్‌ సంస్థ అనూహ్యంగా కొచిన్‌ సర్వీసును రద్దు చేసింది.
 
అనేక అనుమానాలు..
ఈ సర్వీసును తాత్కాలికంగానే రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా.. దాదాపుగా నెల రోజుల నుంచి పునరుద్ధరించకపోవటంతో అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. ఇంతకీ స్పైస్‌జెట్‌ సంస్థ అర్థంతరంగా కొచిన్‌కు విమాన సర్వీసును రద్దు చేయటానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. బోయింగ్‌ మాక్స్‌ శ్రేణికి చెందిన ఒక విమానం క్రాష్‌ కావటంతో.. దేశ వ్యాప్తంగా ఆ విమానాలను ఉపయోగించకూడదని నిర్ణయించారు. దీంతో స్పైస్‌జెట్‌ సంస్థ కూడా తన బోయింగ్‌ మ్యాక్స్‌ విమానాలను ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో బోయింగ్‌ మ్యాక్స్‌ విమానాలు నడిపే రూట్లలో విమాన సేవలను పునరుద్ధరించటానికి ఇతర బోయింగ్‌ శ్రేణి విమానాలను నడపాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని రూట్లలో ప్రవేశపెట్టిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఇలా రద్దు చేసిన రూట్లలో విజయవాడ నుంచి కొచిన్‌ సర్వీసు కూడా ఉంది. దీంతో నెల రోజులుగా కొచిన్‌కు సర్వీసు తిరగటం లేదు. స్పైస్‌జెట్‌ సంస్థ కొత్త విమానాలను సమకూర్చుకునే వరకు ఈ సమస్య తప్పదు. కొత్త విమానాలను సమకూర్చుకునే పనిలో స్పైస్‌జెట్‌ ఉంది. విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని దేశ ఆర్థిక రాజధాని ముంబాయి, తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్‌, కర్నాటక రాష్ట్రంలోని బెంగ ళూరు, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైల తర్వాత.. కేరళ రాష్ట్రంలోని కొచిన్‌ నగరానికి స్పైస్‌జెట్‌ సంస్థ విమాన సర్వీసు ప్రారం భించింది. కేరళ రాష్ట్రంలోని కొచిన్‌కు ఇది ఆరవ సర్వీసు కావటం విశేషం. కొచిన్‌కు సర్వీసుకు సంబంధించి స్పైస్‌జెట్‌ సంస్థ ఇంకా షెడ్యూల్‌ నుంచి తొలగించలేదు. దీనిని బట్టి ఎప్పుడైనా ఈ సర్వీసును ప్రారంభిస్తామన్న సంకేతాన్ని స్పైస్‌జెట్‌ సంస్థ ఇస్తోంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌లో మాత్రం తాత్కాలికంగా రిజర్వేషన్‌ ను నిలుపుదల చేసింది. ఇంకా స్పైస్‌జెట్‌ సంస్థకు విమానాలు రాని నేపథ్యంలో, వర్షా కాలం తర్వాత కూడా కొచిన్‌కు సర్వీసు నడుస్తుందో, లేదో డౌటే. ఈ వేసవికి మాత్రం కేరళ వెళ్లే పర్యాటకులు ఇతర మార్గాలను వెతుక్కోవాల్సిందే.
 
కేరళ రాష్ర్టానికి ఏర్పడిన విమాన కనెక్టివిటీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ వేసవిలో కేరళ రాష్ట్రంలోని ప్రకృతి అందాలను ఫ్లైట్‌లో వెళ్లి చూడాలనుకునే పర్యాటకులకు స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ తీవ్ర నిరాశకు గురి చేసింది. విజయవాడ విమానాశ్రయం నుంచి కొచ్చికు నడుపుతున్న సర్వీసును స్పైస్‌జెట్‌ సంస్థ రద్దు చేసి నెల రోజులు కావస్తోంది. మళ్లీ పునరుద్ధరణ అవుతుందనుకుంటే నెల రోజులైనా స్పైస్‌ జెట్‌ సంస్థ సర్వీసును ప్రారంభించకపోవటంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *