క్రమశిక్షణ నేర్చుకోండి : సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలకు మాయావతి హితవు


ఫిరోజాబాద్ : సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలకు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి హితోక్తులు చెప్పారు. బీఎస్‌పీ కార్యకర్తలను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని ఎస్‌పీ కార్యకర్తలను కోరారు. ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం బీఎస్‌పీ, ఎస్‌పీ, ఆర్ఎల్‌డీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మాయావతి ఆదివారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
 
మాయావతి మాట్లాడుతున్న సమయంలో ఎస్‌పీ కార్యకర్తలు నినాదాలు చేస్తుండటంతో మాయావతి ఇబ్బంది పడ్డారు. ‘‘ప్రసంగం మధ్యలో నినాదాలు, అరుపులు. మీరు బీఎస్‌పీ కార్యకర్తల నుంచి కాస్త నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను మాట్లాడేటపుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా వింటారో. ఎస్‌పీ కార్యకర్తలు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది’’ అని మాయావతి అన్నారు.
 
బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలనుద్దేశించి మాట్లాడుతూ, మీడియా, ఒపీనియన్ పోల్స్, సర్వేల పేరుతో పార్టీలన్నీ తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, ఆ మాయలో పడవద్దని మాయావతి ప్రజలను కోరారు. ఓటర్లు తప్పుదోవ పట్టకూడదన్నారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో చేసే భారీ వాగ్దానాల వెనుక ఏమి ఉందో చూడాలన్నారు. వాటి ప్రలోభాలకు గురి కావద్దని చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *